తెచ్చుకుంది. క్రాంప్టన్‌గ్రీవ్స్, గ్లోబల్ గ్రీన్ ఫుడ్స్ పేరిట నిన్న మొన్నటి వరకు దేశీయ కంపెనీగా ఉన్న అవంతా ఇప్పుడు బహుళజాతి సంస్థగా మారిపోయింది. సుమారు 65 దేశాల్లో తన కార్యకలాపాలను విస్తరించింది.
సంక్షోభం ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో అనివార్యం. సంక్షోభం వచ్చినప్పుడల్లా తన నిర్మాణంలో సర్దుబాట్ల ద్వారా మళ్లీ నిలబడేందుకు ప్రయత్నిస్తుంటుంది. సంక్షోభంలో ఎవరు ఎంత చితికిపోయారు అనే దానిని బట్టి సర్దుబాట్లలో ఎవరిది పై చేయి అనేది నిర్ణయమవుతుంది. 2008 సంక్షోభం అనంతరం ధనికదేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతుంటే చైనా, ఆ తరువాత భారత్ ఆర్థిక వ్యవస్థలు మాత్రమే నిలకడగా ఉన్నాయి. నిలబడ్డాయి. ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు మాటల్లో చెప్పాలంటే ప్రపంచ ఆర్థిక మాంద్యం వల్ల 'ఏ మాత్రం గాయాలపాలవ్వని, దెబ్బతినని' భారతదేశం అప్పట్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రభుత్వ రంగ సంస్థలు బలంగా ఉండడం, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ రంగాల్లోనూ ప్రభుత్వ రంగ సంస్థలు గణనీయంగా ఉండడం, ఫైనాన్స్ పెట్టుబడికి పూర్తిస్థాయిలో దాసోహం కాకపోవడం ఇలా నిలబడ్డానికి కారణాలుగా ఉన్నాయి.
ఎవరేం చెప్పినా, సంక్షోభం వల్ల మనదేశం ఎంతో కొంత నష్టపోయింది. అదే సందర్భంలో వేగంగా కోలుకోవడం కూడా ప్రారంభించింది. వామపక్షాల ఒత్తిడితో యుపిఎ-1 అమలు చేసిన గ్రామీణ ఉపాధి హామీ పథకం దీనికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. గ్రామీణస్థాయి పేద ప్రజానీకం చేతిలో కొనుగోలు శక్తి పెరగడం, దేశీయ మార్కెట్లు సజీవంగా ఉండడంతో మనదేశంలోని గుత్త కంపెనీలు కూడా అంతగా దెబ్బతినలేదు. ఉత్పత్తిలోనూ మన ఎగుమతుల వాటా 20శాతంగానే ఉండడం కూడా సంక్షోభ ప్రభావాన్ని తగ్గించేందుకు ఉపయోగపడింది. వీటితో పాటు ప్రభుత్వం తీసుకున్న ద్రవ్యచలామణి నిర్ణయాలు, ఉద్దీపనల ప్యాకేజీ కూడా తోడయ్యింది.
స్థూలంగా చూసినప్పుడు ఫైనాన్స్‌పెట్టుబడికి దాసోహమవని మన ఆర్థిక వ్యవస్థ, దేశీయంగా డిమాండ్ పెంచేందుకు ఉపయోగపడ్డ గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశీయ గుత్త సంస్థలను ఆర్థిక సంక్షోభ కాలంలో దెబ్బతినకుండా కాపాడాయన్నది అర్థమవుతోంది. విదేశాల్లోని బడా కంపెనీలన్నీ ఫైనాన్స్ పెట్టుబడిని నమ్ముకోవడంతో వాటిల్లో ఎక్కువభాగం సంక్షోభ అనంతర కాలంలో కాగితపు పులుల్లా మారిపోయాయి. ఈ పరిస్థితి దేశీయ గుత్త సంస్థలకు కలిసి వచ్చింది. విదేశాల్లోని సహజవనరుల దగ్గర్నుంచి, పేరెన్నిక కంపెనీల వరకు ఏకబిగిన కొనుగోలును ప్రారంభించాయి. ఈ క్రమంలోనే దేశీయ గుత్త సంస్థలు ఇప్పుడు బహుళజాతి గుత్త సంస్థలుగా అవతారమెత్తుతున్నాయి. వాస్తవానికి సంక్షోభానికి పూర్వం నుంచే టాటామోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, టాటాస్టీల్, సుజలాన్ వంటి కంపెనీలు సంక్షోభం అంచుల్లో ఉన్నట్లు కనపడుతున్న కంపెనీలను కొనేశాయి. ఆయా రంగాల్లో ప్రపంచస్థాయి లీడర్లుగా అవతారమెత్తాయి.
2010 తొలి దశలో బ్రిటన్ నేత కామరూన్, 2010 చివరి అంకంలో ఒబామా, నికోలస్ సర్కోజి, వెన్ జియాబావో, మెద్వదేవ్ భారతదేశంలో పర్యటించారు. ప్రతి ఒక్కరూ రెండంకెల బిలియన్‌డార్లలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాలు దేశీయ గుత్త సంస్థలను మరింత బలోపేతం చేయబోతున్నాయి. యుపిఎ-2 ప్రభుత్వం సహజంగానే ఈ ఒప్పందాల్లో ప్రభుత్వ రంగ సంస్థలను భాగస్వాములను చేయలేదు. ప్రయివేటు వారికి మాత్రమే అనుమతించింది. వచ్చిన అయిదు దేశాధినేతల్లోనూ చైనాకు చెందిన వెన్ అత్యధిక వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటిల్లో అత్యంత ఖరీదైన ఒప్పందం రిలయన్స్‌కు చెందిన అనిల్ అంబానీకి దక్కింది. మిగిలిన 44 ఒప్పందాలు కూడా దేశీయ బడా పరిశ్రమలకే దక్కాయి. ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర ఏ మాత్రమూ లేదు.
దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్న ఆతురతతో, ప్రపంచం నుంచి సంక్షోభ ఛాయలు సమసిపోకముందే డిఫెన్స్, రిటైల్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లోనూ ప్రయివేటు సంస్థలను ఆహ్వానించాలని, ఎఫ్‌డిఐ వాటా పెంచాలని, పెట్టుబడులను ఉపసంహరించాలని కార్పొరేట్ లాబీయిస్టులు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు. యుపిఎ-2 ప్రభుత్వం పోకడలు కూడా ఈ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నట్లుగానే ఉన్నాయి. ఇవి కూడా దేశీయ కార్పొరేట్ సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు తోడ్పాటును అందించబోతున్నాయి. ఇంతకు ముందే చెప్పినట్లు సంక్షోభం తలెత్తినప్పుడల్లా సర్దుబాట్లు ఒక తప్పనిసరి అవసరంగా మారిపోతాయి. దీనర్థం ఇప్పుడు బలబడ్డ మన దేశీయ కంపెనీలు మలి సంక్షోభం నాటికి మన దేశీయ గుత్త సంస్థల చేతుల్లో ఉండొచ్చు. ఉండకపోవచ్చు. ప్రపంచంలోనే ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉన్న మన ఫార్మారంగం ఇప్పుడు క్రమంగా విదేశీ గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోతుండడం ఇందుకు తాజా ఉదాహరణ. సంక్షోభం వచ్చినప్పుడల్లా కంపెనీల పరంగానూ, సంస్థల పరంగానూ జరుగుతున్న సర్దుబాట్లు వాటి స్థానాలను, ఆధిపత్యాలను మారుస్తుంటాయి. వీటిల్లో ఇప్పటి వరకు బాగా లాభపడింది మన దేశీయ గుత్త సంస్థలు, వాటి అధిపతులు మాత్రమే.
ఇక జీత భత్యాలు, ఆస్తిపాస్తుల గురించి చూద్దాం. ఒకవైపు ప్రపంచ కార్పొరేట్లందరూ సంక్షోభం ధాటికి గగ్గోలు పెడుతుంటే మనదేశంలోని నెంబర్ వన్ కుబేరుడు ముఖేష్ అంబానీ మాత్రం తన 16 అంతస్తుల సొంత ఇల్లు 'యాంటిల్లా' నిర్మాణాన్ని నిరాఘాటంగా సాగించారు. ఆయన భార్య నీతా అంబానీ కొత్త ఇంటికోసం సుమారు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి 22 క్యారెట్ల బంగారం/ప్లాటినంతో ట్రిమ్మింగ్ చేసిన డిన్నర్‌సెట్లను కొనుగోలు చేశారు. 500 గదులున్న ఫైవ్‌స్టార్ హోటల్ కూడా ఇంత పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. వేతనం మాత్రం ఈయన గతం కంటే 2010లో తగ్గించుకున్నట్లుగానే కనిపించింది. అదే సందర్భంలో వేతనాలు పెంచుకున్న వారు మాత్రం చాలా మందే ఉన్నారు.
ఇప్పటి వరకు వెలిగిపోతున్న భారతాన్ని చూశాం. ఇప్పుడు చీకటి భారతాన్ని చూద్దాం. సంక్షోభం అనంతర కాలంలో కేంద్ర కార్మికశాఖ ఉపాధిపై ఒక నివేదికను తయారుచేసింది. ఇది అభివృద్ధి వేగానికి, వాస్తవ భారతానికి మధ్య ఆంతర్యాన్ని స్పష్టంగా ఎత్తి చూపింది. మన జనాభాలో 75శాతం మంది 35ఏళ్లలోపు వారే ఉన్నారు. వీరి ఆకాంక్షలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు లభించలేదు సరికదా సంక్షోభం వల్ల ఉన్న ఉపాధి కూడా పోయింది. పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు అభివృద్ధి కాలేదు. సంక్షోభం వల్ల దెబ్బతిన్న ఎగుమతి రంగం ప్రభుత్వం ఇచ్చిన ఉద్దీపనతో యాంత్రీకరణకు వెళ్లింది.
ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. కార్మికచట్టాల్లో తెచ్చిన సవరణల వల్ల కార్మికులు, ఉద్యోగులకు ఉద్యోగభద్రత కూడా లేకుండా పోయింది. మనదేశ జనాభాలో శ్రమశక్తి 35శాతం ఉందనుకుంటే అందులో 9.4శాతం నిరుద్యోగసైన్యంలో ఉన్నది. మిగిలిన వారిలో 43శాతం మంది స్వయం ఉపాధిపై, 39శాతం మంది క్యాజువల్ కార్మికులుగానూ, 16శాతం మంది వేతన కార్మికులుగానూ ఉన్నారు. వీటికి తోడు ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాల వల్ల పెట్రోలు ధరలు, నిత్యావసర సరుకుల ధరలు బాగా పెరిగిపోయాయి. కొనుగోలుశక్తి దారుణంగా పడిపోతోంది. వేతనాల్లో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ ధరలు పెరగడంతో నిజ వేతనాలు పడిపోతున్నాయి. సంక్షోభానంతరం అంబానీలు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇంట్లోకి వంట పాత్రలు కొనుక్కుంటుంటే, దేశంలోని అత్యధిక జనాభా తాము బతికేందుకు ఇంట్లోని పాత్రలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. ఇదీ సంక్షోభానంతర వాస్తవ భారత్ ముఖచిత్రం.
జగదీష్
No comments:
Post a Comment