Friday, September 16, 2011

వడ్డీరేట్లు మళ్లీ పెరుగుతాయా?


ఈ వారం ఆహార ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయి నుంచి కొద్దిగా తగ్గినప్పటికీ, ఆగస్టు నెలలో మొత్తం ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి పెరిగింది. అంతర్జాతీయంగా చూస్తే పరిస్థితులు అస్సలు బాగోలేవు. ఆహార, ఆహారేతర సరుకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో రెండు శాతం కూడా తగ్గలేదు. అంతటా డిమాండ్‌కు తీవ్రమైన కొరత ఉందని చెబుతున్నప్పటికీ ముడి చమురు బ్యారెల్‌ ధర ఆకాశానికేసే పరిగెడుతోంది. బంగారం ధర కూడా కొత్త స్థాయిల్లోకి ఎగబాకుతోంది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టేందుకు 2010 మార్చి నుంచి 2011 జులై దాకా ఆర్‌బిఐ 11 సార్లు కీలక రేట్లను సవరించింది. 325 బేసిస్‌ పాయింట్లు (3.25శాతం) పెంచింది. దీనివల్ల ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోగా పారిశ్రామికోత్పత్తి (ఐఐపి) మీద ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. ఫలితంగా జూన్‌లో 6.6శాతం వృద్ధిరేటును నమోదు చేసుకున్న ఐఐపి, జులైలో 3.3శాతానికి పడిపోయింది. ఓ వైపు ఎగబాకుతున్న ద్రవ్యోల్బణం, మరోవైపు పడిపోతున్న పారిశ్రామికోత్పత్తి ఆర్‌బిఐని కత్తిమీద సాము చేయిస్తున్నాయి. శుక్రవారం నాడు జరగబోయే త్రైమాసిక మధ్యంతర ద్రవ్య సమీక్ష సందర్భంగా వడ్డీరేట్ల సవరణపై ఆర్‌బిఐ తన నిర్ణయాన్ని వెల్లడించబోతోంది.
వడీరేట్లు పెరిగితే ద్రవ్యోల్బణం తగ్గుతుందా?
మార్కెట్లో వస్తువులు, సేవలు, సరుకుల కంటే ద్రవ్యం అధికంగా ఉన్న స్థితిని ద్రవ్యోల్బణం అంటున్నారు. ద్రవ్య చలామణిని నియంత్రిస్తే సమతుల్యత ఏర్పడి ధరలు తగ్గుతాయని, ద్రవ్యోల్బణం తగ్గుతుందని భావన. ఈ భావనతోనే ఆర్‌బిఐ గత 11 సార్లుగా 3.25శాతం కీలకరేట్లు పెంచింది. బ్యాంకుల్లో పోగుపడ్డ నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయనీయకుండా రెపో, రివర్స్‌రెపో రేట్లను పెంచుతూ పోయింది. ఎప్పుడైతే కీలకరేట్లను సవరిస్తూ పోయిందో అప్పుడు పరిమిత వనరులతో తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు బ్యాంకులు అనివార్యంగా రుణాలపై వడ్డీని అధికంగా ఛార్జీ చేశాయి. వడ్డీరేట్లు పెరుగుతూ పోయాయి. దీంతో రుణాల పరపిణీ తగ్గుతుందని ఆర్‌బిఐ అంచనా వేసింది. ఇందుకు భిన్నంగా జనవరి నుంచి ఆగస్టు 26 నాటికి రుణాల పంపిణీ గత ఏడాదిస్థాయి రూ.34.54లక్షల కోట్ల నుంచి 41.70లక్షల కోట్లకు (20.78శాతం) పెరిగింది. డిపాజిట్లు కూడా 48.18లక్షల కోట్ల నుంచి 56.62లక్షల కోట్ల దాకా (17.5శాతం) పెరిగాయి. దీనిని బట్టి ఆర్‌బిఐ కీలక రేట్లను ఎంత సవరించినప్పటికీ ద్రవ్యచలామణికి మాత్రం ముకుతాడు వేయలేకపోయింది. ఇప్పుడైనా బాగా పెంచి (కనీసం 50 బేసిస్‌పాయింట్ల) ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలని కొంత మంది నిపుణులు చెబుతున్నారు. అప్పుడే ధరలు తగ్గుతాయని వారు వాదిస్తున్నారు.
ద్రవ్యోల్బణం నిజ ధరల పెరుగుదల ఒక్కటేనా?
వారం వారం టోకుధరల సూచి, ఆహార ద్రవ్యోల్బణ సూచి ఫలితాలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆయా సరుకుల ధరలను ఒక్కదగ్గర వేసి సగటు కట్టి ధరలు పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? అని చెప్పే పద్ధతి ఇప్పుడు అమల్లో ఉంది. ఉల్లిగడ్డ ధర ఆంధ్రప్రదేశ్‌లో పెరిగి, మిగిలిన అన్ని రాష్ట్రాల్లో తగ్గిపోతే ఉల్లిగడ్డ ధర తగ్గిందనే ప్రస్తుత సూచీలు చెబుతాయి. అప్పుడీ సూచీ ఫలితం ఆంధ్రప్రదేశ్‌లో తప్పవుతుంది. దేశవ్యాప్తంగా ఉండే సాధారణ ధోరణులను పరిశీలించడం వేరు, ఆయా ప్రాంతాల్లో నిర్దిష్టంగా కొన్ని సరుకులపై పెరిగిన ధరలను పరిశీలించడం వేరు. దీనికీ మార్కెట్లోని ద్రవ్యచలామణికి ఎలాంటి సంబంధం లేదు. 'సరఫరాకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తే వీటి ధరలు తగ్గిపోతాయి. ఉత్పత్తి, దేశీయ అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఎగుమతి, దిగుమతి విధానాలపై ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకున్నా అనేక సరుకుల ధరలను అదుపులో పెట్టొచ్చు. ఫ్యూచర్‌ ట్రేడింగ్‌ అనుకూల విధానాలను అమలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి సరుకుల ధరలను నిర్ణయించే ఈ కీలక దశల్లో ప్రభుత్వ జోక్యం తగ్గిపోయింది. మార్కెట్‌ శక్తులకు వదిలేసింది. నిజ ధరలు పెరగడానికి ఇదే కారణమ'ని ఆర్థిక నిపుణులు సిపి చంద్రశేఖర్‌ చెబుతున్నారు.
వడ్డీరేట్ల పెంపు వల్ల నష్టపోయిందెవ్వరు?
అంతర్జాతీయ మార్కెట్లో ముఖ్యంగా ధనిక దేశాల్లో రుణాలపై వడ్డీరేట్లు సున్నాస్థాయికి చేరాయి. ప్రతిగా అభివృద్ధి చెందుతున్న మన లాంటి దేశాల్లో వడ్డీరేట్లు భారీగా పెరిగాయి. ఎంఎన్‌సీలకు, దేశంలోని బడా కార్పొరేట్లకు 3000కోట్ల డాలర్ల మేర విదేశీ వాణిజ్య రుణాలు (ఇసిబి) తెచ్చుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇవి విదేశాల నుంచి అతి తక్కువ ధరకు రుణాలు తెచ్చుకుని, ఇక్కడ అధిక రేట్ల వద్ద డిపాజిట్లు చేయడం ద్వారా విపరీతంగా లాభపడ్డాయి. ఎటొచ్చి చిన్న, మధ్య తరహా పరిశ్రమలకే ఈ అవకాశం లేదు. వీరు దేశీయ షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకుల నుంచి మాత్రమే రుణాలను పొందే అవకాశం ఉంది. అదీ అధిక వడ్డీరేట్ల మీద. సామాన్యులు సైతం తమ అవసరాలు తీర్చుకునేందుకు ఎక్కువ వడ్డీలకు రుణాలను తెచ్చుకోవాల్సి వచ్చింది. ఓ వైపు నిత్యావసర, అత్యవసర, ముడిసరుకుల ధరలు పెరగడం ద్వారా మార్కెట్లో అధికంగా వెచ్చించిన సాధారణ పౌరులు, అధిక వడ్డీరేట్ల రూపంలో రెండో మారు కూడా అధిక మొత్తాలను కోల్పోవాల్సి వచ్చింది. ధరలు అధికంగా ఉండడం వల్ల వ్యాట్‌రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధిక వడ్డీరేట్లు వసూలు చేయడం ద్వారా వాణిజ్య బ్యాంకులు ఈ కాలంలో విపరీతంగా ఆర్జించాయి.
ఆర్‌బిఐ ముందున్న అవకాశాలు
ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టేందుకు ద్రవ్య సమీక్షను చేపట్టినా, కీలక రేట్లను సవరించినా దేశ జిడిపి వృద్ధి రేటు మీద కచ్చితమైన ప్రభావం ఉంటుందని ఆర్‌బిఐ ఎప్పుడూ చెబుతూనే ఉంది. వాస్తవానికి అది చెప్పినట్లే జరుగుతోంది. జిడిపి వృద్ధిరేటుపై అంచనాలు ఇప్పటికే ఒకశాతం తగ్గిపోయాయి. ప్రజలు మార్కెట్లో వెచ్చించే మొత్తాలు రెండు శాతం తగ్గిపోయాయి. పారిశ్రామికోత్పత్తి 3.3శాతం తగ్గిపోయింది. ఎగుమతి రంగం దెబ్బతిని దిగుమతులు భారీగా పెరిగిపోయి వాణిజ్యలోటు పెరిగిపోతోంది. ద్రవ్యోల్బణం తగ్గించేందుకు విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకోవాలని అది ప్రభుత్వానికి చెబుతూనే ఉంది. కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఆర్‌బిఐపైనే భారాన్ని నెట్టింది. తాజాగా 'వడ్డీరేట్లు తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు టర్కీ, బ్రెజిల్‌ తరహా ప్రయోగాలు చేయాల'ని ప్రధాని ఆర్థిక సలహాదారు రంగరాజన్‌, ప్రభుత్వ ఆర్థికవేత్తలు రాహుల్‌ఖుల్లర్‌, కౌషిక్‌బసు ఉచిత సలహాలనిస్తున్నారు. ద్రవ్యోల్బణం పాపాన్ని అంతర్జాతీయ పరిస్థితుల మీద నెట్టి, విధాన పరంగా ప్రభుత్వం చేయాల్సిన పనిని కప్పిపెట్టి, ఇప్పుడు కూడా వడ్డీరేట్ల తగ్గింపు, పెంపుల గురించే మాట్లాడుతున్నారు. ఎవరేం చెప్పినా ద్రవ్యోల్బణం తాను నిర్దేశించుకన్న దానికంటే ఎక్కువే ఉండడంతో దానిని అదుపులో తెచ్చేందుకు 25 నుంచి 50 బేసిస్‌పాయింట్లు కీలకరేట్లను సవరించవచ్చు. లేదంటే సర్వత్రా వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో తాత్కాలికంగా పెంపును వాయిదా వేయొచ్చు.
http://www.prajasakti.com/finance/article-271635

Thursday, September 8, 2011

క్లినికల్‌ ట్రయల్స్‌పై స్వీయ నియంత్రణ





క్లినికల్‌ ట్రయల్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న సందర్భంలో తమకు తామే స్వీయ నియంత్రణ పద్ధతులను పాటిస్తామని క్లినికల్‌ పరిశోధనల సంస్థలు (సిఆర్‌ఒ) ప్రకటించాయి. మందుల ప్రయోగానికి సిద్ధపడ్డ వాలంటీర్ల పేర్లను ఎంపిక చేసే సమయంలో వీడియో, ఆడియో రికార్డుంగు కూడా చేస్తామని తెలిపాయి. ఒకే వాలంటీర్‌ వివిధ ప్రయోగాల్లో పాల్గొనకుండా నివారించేందుకు వాలంటీర్ల జాబితాను సంయుక్తంగా నిర్వహిస్తామని ప్రకటించాయి. జెనరిక్‌ డ్రగ్స్‌ను అభివృద్ధి చేసే క్రమంలో ప్రయోగాలపై పారదర్శకతను పాటించేందుకు ఇవి దోహదం చేస్తాయని సదరు సంస్థలు ప్రకటించాయి.
గత జూన్‌ నెలలో యాక్సిస్‌ క్లినికల్స్‌ లిమిటెడ్‌, అరబిందో ఫార్మా కంపెనీలు చట్ట విరుద్దంగా చేపట్టిన ప్రయోగాల ద్వారా అనేక మంది జబ్బుల బారిన పడిన విషయం తెలిసిందే. నిరక్షరాస్యులైన పేద వాలంటీర్లపై యాంటీ-క్యాన్సర్‌ డ్రగ్స్‌ను ప్రయోగించినప్పుడు సైడ్‌ ఎఫెక్ట్స్‌, ఇతర తీవ్రమైన జబ్బులు వచ్చాయని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డిసిజిఐ) యాక్సిస్‌ లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే స్వీయ నియంత్రణలను ఏర్పాటు చేసుకునేందుకు సిఆర్‌ఒలు ముందుకు వచ్చాయి.
రాష్ట్రంలో ఆరు కంపెనీలకు చెందిన 12 సిఆర్‌ఒ సంస్థలున్నాయి. ఇందులో సిప్రా ల్యాబ్‌ అయిజంట్‌, క్యూపిఎస్‌ బయో సర్వ్‌ ఇండియాలు సైతం స్వీయ నియంత్రణ ఫోరంలో చేరాయి. మిగిలిన సంస్థలు కూడా ఇందులో చేరే అవకాశం ఉందని వ్యాపార వర్గాల కథనం. జీవ సంబంధ క్లినికల్‌ ట్రయల్స్‌లో రాష్ట్రం వాటా 15 నుంచి 20శాతం దాకా ఉంది. దీని మార్కెట్‌ విలువ పదికోట్ల దాకా ఉంటుంది. దేశవ్యాప్తంగా మొత్తం 40 సిఆర్‌ఒలున్నాయి.
'వ్యక్తులపై క్లినికల్‌ ప్రయోగాలు చేసే సమయంలో వీడియో, ఆడియో రికార్డింగ్‌ను చేపట్టాలని నిర్ణయించుకున్నామ'ని ఆక్సిస్‌ ల్యాబ్‌ ఎండి ఎం శరత్‌చంద్రా రెడ్డి అన్నారు. ప్రస్తుతం డిజిసిఐ రెండేళ్లకోసారి తమ మౌలిక వసతులు, ప్రయోగాలపై పర్యవేక్షణ చేస్తోందని, ఇకపై ప్రతి ఏడాదికి ఒక సారి పర్యవేక్షణ చేయాలని సిఆర్‌ఒ ఫోరం కోరుతుందని చెప్పారు. ఒక ఔషధాన్ని అభివృద్ధి చేయడానికి ఎనిమిది నుంచి 12 ఏళ్ల సమయం పడుతుందని రా కెమ్‌ ఫార్మ సిఇఒ శిరీష్‌ కుమార్‌ అన్నారు. ఇందులో రూ.4,500 కోట్ల పెట్టుబడి పెట్టబడిందన్నారు. ఇప్పటి వరకు భారతీయ కంపెనీలు ఒక్క కొత్త ఔషధాన్ని కూడా అభివృద్ధి చేయలేకపోయాయని, దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
http://www.prajasakti.com/politicians/article-269156

Wednesday, September 7, 2011

'డ్రెడ్జింగ్‌'లో ఉపసంహరణకు నో

విశాఖపట్టణం కేంద్రంగా పనిచేస్తున్న డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డిసిఐ)లో పెట్టుబడుల ఉపసంహరణ కూడదని నౌకాయాన మంత్రిత్వశాఖ అభిప్రాయపడింది. ఇప్పటికే సంస్థ మార్కెట్‌ విలువ తక్కువగా ఉందని, మార్కెట్లో పరిస్థితులు కూడా బాగాలేవని, ఈ నేపథ్యంలో ఉపసంహరణ చేపడితే మొదటికే మోసం వస్తుందని అది అభ్యంతరం వ్యక్తం చేసింది.వాస్తవానికి ప్రభుత్వం ఇప్పటి దాకా 22.5శాతం మేర వాటాలను ఉపసంహరించుకుంది. మరో 2.5శాతం ఉపసంహరించుకుని 25శాతానికి చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.40వేల కోట్లు సమీకరించాలనే ప్రయత్నానికి ఇది కూడా తోడవుతుందని ప్రభుత్వం భావన.
'2010-11లో డిసిఐ 39 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిన మాట వాస్తవమే. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో డిసిఐ నికరలాభాలు గణనీయంగా పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసిక కాలంలో నికర లాభాలు 80శాతం మేర పడిపోయి రూ.3.02కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నికర లాభాలు రూ.15.76కోట్లుగా ఉంది. లాభాలు తగ్గిపోతున్నందున విలువ కూడా పడిపోతోంది.' అని మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

స్వయం ప్రతిపత్తిని కల్పించకుండా, డిసిఐలో ప్రభుత్వ అనవసర జోక్యం పెరుగుతున్నందు వల్లే దాని లాభాలు తగ్గిపోతున్నాయని రవాణా, పర్యాటకం, సాంస్కృతిక అంశాలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఇది వరకే నిర్దారించింది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పెట్టుబడులను ఉపసంహరించలేకపోతే లాభదాయక సంస్థ కాదనే పేరిట దీనిని ప్రయివేటీకరించేందుకు సైతం ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని అధికారవర్గాల కథనం. డిసిఐని కొనుగోలు చేసేందుకు, దీనివద్ద ఉన్న అపారమైన మౌలిక వనరులను, సాధనాసంపత్తిని చేజిక్కించుకునేందుకు, డ్రెడ్జింగ్‌ పనిలో ఇప్పటికే ఉన్న కార్పొరేట్లు సైతం ఆసక్తిని కనబరుస్తున్నారు.

Monday, September 5, 2011

రామగుండం యూరియా ప్లాంటుకు మోక్షమెప్పుడో?

రామగుండం యూరియా ప్లాంటుకు ఇప్పుడిప్పుడే మోక్షం సిధ్దించేట్లు కనిపించడం లేదు. 1980 నుంచి 1999 వరకు సుమారు రెండు దశాబ్దాలు యూరియా ఉత్పత్తిలో ఒక వెలుగు వెలిగిన ఈ ప్లాంటు సరళీకృత ఆర్థిక విధానాలకు బలైపోయింది. మూతపడింది. 12ఏళ్ల తరువాత, దేశంలో డిమాండ్‌కు సరపడ యూరియా దొరకడంలేని ప్రస్తుత పరిస్థితుల్లో మన ఏలికలకు మళ్లీ ఈ ప్లాంటు స్ఫురణకు వచ్చింది. తెరుస్తామన్నారు. కేంద్ర కేబినెట్‌ ఆగస్టు నాలుగున ఇందుకు ఓకే కూడా చెప్పింది. రెండు వారాల క్రితం రాజ్యసభలో సంబంధిత మంత్రి కూడా దీనిని తెరుస్తున్నామన్నారు. ప్లాంటు తెరవడంపై ప్రకటనల మీద ప్రకటనలు వస్తున్నాయే కానీ ఇప్పటి వరకు ఎవరో ఒకరు వచ్చి తాళం కూడా తీసిన పాపాన పోలేదు.
ఇదీ ప్రస్తుత పరిస్థితి
ప్లాంటును పునరుద్ధరించాలని కేంద్రప్రభుత్వం ప్రకటించి నెల రోజులు గడిచినప్పటికీ తాళం తీయలేదు. దానికి కూడా తుప్పు పట్టి ఉంది. అంటే ఏ అధికారీ కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్లాంటులో చెక్‌రిపబ్లిక్‌, జర్మనీ, ఇటలీ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న టెక్నాలజీ, యంత్రాలు ఉన్నాయి. ఏప్రిల్‌ ఒకటి, 1999 నుంచి, అంటే దాదాపు 12ఏళ్లుగా ఇవేవీ పనిలో లేవు. వీటిని తిరిగి పనిలో పెట్టాలంటే కనీసం నాలుగు నెలలైనా పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్లాంటు ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎఫ్‌సిఐఎల్‌) ఆధ్వర్యంలో నడుస్తోంది. దీని పునరుద్ధరణ పనుల గురించి కంపెనీ కేంద్ర కార్యాలయంలోని ప్రత్యేకాధికారి కె.ఎల్‌.రావుతో ప్రజాశక్తి సంప్రదించగా 'దీనిపై తనవద్ద సమాధానమేదీ లేద'ని చెప్పారు. యాజమాన్యం దీనిని తెరిచేందుకు కనీస ప్రయత్నం చేస్తున్నదా లేదా అనే విషయాలేమీ తెలియరాలేదు.
గ్యాస్‌పైప్‌లైన్‌ వస్తుందా? రాదా?
ఈ ప్లాంటును బొగ్గు ఆధారంగా కాకుండా గ్యాస్‌ ఆధారంగా నడపాలని ప్రభుత్వం భావించింది. దీనికోసం గ్యాస్‌పైప్‌లైన్‌ వేస్తామని ప్రకటించింది. రెండ్రోజుల క్రితం స్థానిక ఎంపి పొన్నం ప్రభాకర్‌ సైతం గ్యాస్‌పైప్‌లైన్‌ నిర్మాణం గురించి స్థానికంగా జరిగిన ఒక కార్యక్రమంలో ప్రస్తావించారు. పైప్‌లైన్‌ ప్లాంటు వద్దకు చేరుకునే సరికి నాలుగు నెలలు పడుతుందన్నారు. పైప్‌లైన్‌ పని హైదరాబాదు శివారులోని శామీర్‌పేట నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామగుండం ప్లాంటు వరకు జరగాలి. అయితే పైప్‌లైన్‌ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. దీనికి సంబంధించిన టెండర్లు కూడా ఖరారు కాలేదు. అంతెందుకు గ్యాస్‌ను ఎవరి వద్ద నుంచి సేకరించాలి? ఎక్కడి నుంచి సరఫరా చేయాలన్నది కూడా ఇంకా నిర్దారణ కాలేదు. స్థానికంగా దొరికే బొగ్గును కాకుండా, ఎప్పుడొస్తుందో తెలియని గ్యాస్‌ వచ్చిన తరువాత దీనిని పునరుద్ధరిస్తామని చెప్పడమంటే శాశ్వతంగా తాళం వేయడమేనని అధికారవర్గాలు చెబుతున్నాయి.
యూరియా అవసరాలు తీరేనా?
పెరుగుతున్న యూరియా డిమాండ్‌ అవసరాలను తీర్చేందుకే రామగుండం యూరియా ప్లాంటును తెరుస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 285లక్షల టన్నుల యూరియా అవసరం కాగా, మన దేశంలో 218.80లక్షల టన్నుల యూరియానే ఉత్పత్తి అవుతోంది. మిగతాది దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీనిని నివారించాలంటే రామగుండం సహా మూతేసిన మరో అయిదు ప్లాంట్లను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణయమైతే చేసింది గానీ, దాని అమలుకు మాత్రం చిత్తశు ద్ధితో ప్రయత్నించడం లేదని క్షేత్రాస్థాయి పరిశీలన స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది యూరియా ఉత్పత్తిని మరో నాలుగులక్షల టన్నుల మేర పెంచాలని ఇప్పటికే పరిశ్రమలకు లక్ష్యాలను కేటాయించింది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా యూరియా ఉత్పత్తి పరిశ్రమలు లక్ష్యాలను అందుకోలేకపోయినా, దిగుమతులు సరిపడ రాకపోయినా గత ఆర్థిక సంవత్సరంలోలాగానే ఈ సారి కూడా రైతులు యూరియా కోసం రోడ్లమీద పడిగాపులు గాయాల్సిన దుస్థితి ఏర్పడనుంది. దీనిని నివారించాలంటే ప్రభుత్వ హయాంలో పనిచేసే రామగుండం యూరియా ప్లాంటును తక్షణం తెరవాల్సి వుందని అధికారులు చెబుతున్నారు.
 http://www.prajasakti.com/finance/article-268292

Saturday, September 3, 2011

ముమ్మాటికీ చట్ట విరుద్ధం


మానెసర్‌ ప్లాంటులో కార్మికులపై మారుతి సుజుకి యాజమాన్యం పలు రకాల నిర్బంధాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండింటి మధ్య నెలకొన్న స్తబ్ధత ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో త్వరలో పదవి నుంచి రిటైర్‌ అవుతున్న కార్మికశాఖ కార్యదర్శి పిసి చతుర్వేది మారుతి సుజుకి వైఖరిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆ సంస్థ చేస్తున్న పని ముమ్మాటికీ చట్ట విరుద్ధమైనదని ఆయన ప్రకటించారు.
ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ 'ఏదైనా ఒక కంపెనీ తన వద్ద పనిచేస్తున్న కార్మికులను బలవంతంగా బాండుపై సంతకాలు పెట్టించాలని ప్రయత్నించడం చట్టవిరుద్ధం. ఉద్యోగానికి సంబంధించిన అంశాలను స్వేచ్ఛగా చర్చించేందుకు కార్మికులకు అవకాశం ఉంది' అని ఆయన అన్నారు.
ఈ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే మారుతి సుజుకి ఛైర్మన్‌ ఆర్‌సి భార్గవ తాము చేస్తున్నది చట్టబద్దమేనని ప్రకటించారు. హర్యానా ప్రభుత్వంతో యాజమాన్యం-యూనియన్‌ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కార్మికులను అలాంటి బాండు అడిగేందుకు తమకు చట్టబద్ధంగా హక్కుందని భార్గవ చెబుతున్నారు. '2001లో సైతం దీర్ఘకాలిక సమ్మె తరువాత కార్మికులను ఒక బాండు రాయాలని మేము అడిగాం. చట్టబద్దంగా ఉండి అది బాగా పనిచేసింది.' అని ఆయన అన్నారు.
హర్యానాకు సంబంధించిన పారిశ్రామిక ఉద్యోగాలు (స్టాండింగ్‌ ఆర్డర్స్‌) యాక్ట్‌-1946ను అనుసరించి 50 మంది కార్మికులకంటే ఎక్కువ మంది పనిచేస్తున్న కంపెనీల్లో యాజమాన్యం-యూనియన్‌ కలిసి పారిశ్రామిక సంబంధాలకు సంబంధించిన నియమనిబంధనలను ఖరారుచేయాల్సి ఉంటుంది. వీటిని రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించాల్సి ఉంటుంది. మారుతీ దీనినే కీలకంగా చేసుకుని కార్మికులపై ఒత్తిడిని తీసుకువస్తోంది.
వాస్తవానికి మారుతీ సుజుకి కంపెనీలో ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న యూనియన్‌ను సైతం గుర్తించేందుకు అది నిరాకరిస్తోంది. అంతే కాదు సదరు యూనియన్‌కు గుర్తింపునివ్వకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అది లేఖ రాసింది. చట్ట ప్రకారం త్రైపాక్షిక ఒప్పందంలో యూనియన్‌కూడా ఉండాలి. కానీ ఈ కేసులో అలా జరగలేదు. మారుతీసుజుకి ప్లాంటు ఏర్పాటు సందర్భంగా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాన్ని అనుసరించి కార్మికచట్టాలపై కూడా యూనియన్‌ పాత్ర లేకుండా కంపెనీకి ఆ హక్కు బదలాయించబడింది. కంపెనీ ఏర్పాటు చేస్తున్నప్పుడు కార్మికుల హక్కులపై జరిగిన తొలిదాడి ఇది.
చట్టబద్దంగా బాండు రాయమనే హక్కు తనకుంది కాబట్టి దానినే అడుగుతున్నానని మారుతీ అంటోంది. ఇప్పటికే యూనియన్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే పేరిట అనేక మందిని తొలగించిన మారుతి, మిగిలిన వారిపైనా వేధింపులకు పాల్పడుతోంది. బాండు మీద కేవలం 40 మందే సంతకాలు చేశారు. మిగిలినవారంతా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనను బేఖాతరు చేయాలని భావించిన మారుతీ తాజాగా ఐఐటి ట్రైనీలను ఈ కంపెనీలో తాత్కాలికంగా పనిచేయించేందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా ఉత్పత్తిని ప్రారంభిస్తానని చెబుతోంది. 'కార్మికులంతా కలిసి కావాలనే ఉత్పత్తిని నిలిపివేస్తున్నారు. కంపెనీ లక్ష్యాలకు వెన్నుపోటు పొడుస్తున్నారు. అందుకే బాండుపై సంతకం పెట్టాలని అడుగుతున్నాం' అని కంపెనీ యాజమాన్యం చెబుతుండగా ఇంకా గుర్తింపును పొందని ప్లాంటు యూనియన్‌ నేత శివకుమార్‌ దీనిని తీవ్రంగా ఖండించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ కంపెనీకి వ్యతిరేకంగా పనిచేయాలని కార్మికులెవ్వరూ అనుకోవడం లేదని, కార్మికులతో యాజమాన్యం సత్సంబంధాలను కలిగి ఉండాలని మాత్రమే తాము చెబుతున్నామన్నారు. ఇందుకోసం యూనియన్‌ను గుర్తించి, దానితో చర్చలు జరపాలని శివకుమార్‌ అన్నారు. మారుతి సుజుకి ప్లాంటులో కార్మికులకు, యాజమాన్యానికి మధ్య స్తబ్ధత నెలకొని పారిశ్రామిక సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కానీ ఇప్పటి దాకా అది స్పందించలేదు. కేంద్రం సైతం నేరుగా జోక్యం చేసుకునే అవకాశాలు కన్పించడంలేదు. ఈ విషయంపై పి.సి.చతుర్వేది స్పందిస్తూ 'ఇది రాష్ట్ర్రం పరిధిలోకి వస్తుంది. అక్కడే పరిష్కారానికి ప్రయత్నం జరగాలి. కేంద్రం జోక్యం చేసుకోవలంటే మమ్మల్ని ఎవరైనా సంప్రదించలేదు. ఇప్పటి వరకు ఎవ్వరూ మమ్మల్ని సంప్రదించనందున మేము జోక్యం చేసుకునే అవకాశం కూడా లేద'ని ఆయన అన్నారు.