Saturday, January 1, 2011

2011 - ఉపాధి హరణ సంవత్సరం?

90వేల చేపల వేట ఓడలతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న ఐరోపా యూనియన్‌కు ఒక కొత్త సమస్య వచ్చి పడింది. తమ ఓడలు గణనీయంగా మత్య్ససంపదను తోడేయడంతో ఇప్పుడక్కడ చేపలు దొరకట్లేదు. ఆ ఓడలకు కూడా పని లేకుండా పోయింది. వాటికి పని కల్పించేందుకు మన దేశ జలాల్లోకి పంపుతానని ఇయు చెబుతోంది. ఆ ఓడలు ఇక్కడ చేపలు పట్టి మనకే అమ్ముతాయట. అలా అమ్మే చేపలపై దిగుమతి సుంకాలు సున్నా స్థాయికి తీసుకురావాలట. సాధ్యమైనంత త్వరగా ఇలాంటి ఒప్పందంపైన సంతకం పెట్టాలని, లేదంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలోనైనా(ఎఫ్‌టిఎ) ఈ అంశాన్ని చేర్చాలని, అది కూడా ఈ మూడు నెలల్లోనే ఖరారు చేయాలని యుపిఎ-2 పాలకులపై ఇయు ఒత్తిడి తెస్తోంది. మన పాలకులు కూడా ఎఫ్‌టిఎలో ఏ అంశాలున్నాయో చెప్పట్లేదు. అత్యంత రహస్యంగా ఒప్పందాలను ఖరారు చేయబోతున్నారు.

ఇయు ఒత్తిడిని ఖండించడమూ లేదు. ఇలాంటి ఒప్పందం కనుక జరిగితే రెండు పరిణామాలు జరుగుతాయి. ఒకటి ఇయు ఓడలు పట్టే చేపలు దేశీయ మార్కెట్లోకి ప్రవేశించి దేశీయ వ్యాపారులను దెబ్బతీసే ధరలకు అమ్మొచ్చు. రెండోది రిటైల్‌ రంగంలో కూడా ఇయు పెద్ద ఎత్తున్నే ప్రవేశించనున్నందున అందులో చేపల మార్కెట్లను పెట్టి స్థానిక మార్కెట్లను, దానిపై ఆధారపడ్డ వృత్తిదారులందరినీ దెబ్బతీయొచ్చు. మన దేశంలో కేవలం చేపలు పట్టే పనిలో ఉన్న (2005 గణాంకాలను అనుసరించి) 35,19,116 మంది మత్య్సకారులు, చేపల ఉత్పత్తి-వ్యాపారంపై ఆధారపడ్డ కోటీ 44లక్షల మంది ఉపాధి ప్రమాదంలో పడబోతోంది.
2011లో సంభవించబోయే దుష్పరిణామాల్లో ఇది శాంపిల్‌ మాత్రమే. ఇయు ఎఫ్‌టిఎ, ఇండో యుఎస్‌ సిఇఓ ఫోరమ్‌ ఒప్పంద నిర్ణయాలు అమలు జరిగితే మనదేశంలో ఇప్పటిదాకా బలంగా ఉండి, ఉపాధి కల్పనలో ప్రధాన భూమికను పోషిస్తున్న వ్యవసాయోత్పత్తులు, డెయిరీ పరిశ్రమ, మందులు-రసాయన పరిశ్రమ, చిల్లర వర్తకం రంగాలు కూడా ఈ విధంగానే దెబ్బ తింటాయి. స్వేచ్ఛా వాణిజ్యం పేరిట ఈ రంగాలన్నింటా ఆయా దేశాల్లో కూడా మన దేశీయ పరిశ్రమలను వ్యాపారం చేసుకోవచ్చని ఇయు, అమెరికా ఆహ్వానిస్తున్నాయి. అందుకు అవసరమైన భౌతిక పరిస్థితులను మాత్రం అవి సృష్టించడం లేదు.
వ్యవసాయ ఉత్పత్తులనే తీసుకుందాం. ఇయు దేశాలన్నింటికీ భారతదేశం అతిపెద్ద ఏకైక మార్కెట్టుగా ఉంటే, భారత్‌కు 26 వేర్వేరు మార్కెట్లుగా ఇయు దేశాలుంటాయి. ఎఫ్‌టిఎ అమలు జరిగితే దిగుమతులు ఎంత సులువుగా వస్తాయో, ఎగుమతులప్పుడు అన్ని సమస్యలు వస్తాయి. ప్రతి దేశం ఒక్కో తరహా ప్రమాణాలను పాటిస్తోంది. ఇప్పటికే 32 రకాల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులను రకరకాల కారణాలు చూపెట్టి ఇయు దేశాలు నిషేధించాయి. ఎఫ్‌టిఎపై చర్చలు జరుగుతున్న సమయంలోనూ, ఒప్పందాన్ని రూపొందిస్తున్న ప్రస్తుత తరుణంలోనూ ఐరోపాదేశాలు వ్యవసాయానికిచ్చే సబ్సిడీలపై యుపిఎ-2 ప్రశ్నించలేదు. వారూ పెదవి విప్పలేదు. ఐరోపా దేశాల్లోని రైతులకు రెండు రకాల సబ్సిడీలు వస్తున్నాయి. ఒకటి ఆయా దేశాల వారు అందించేవి, రెండోది ఇయు మొత్తానికి వర్తించే విధంగా దాని ఉమ్మడి బడ్జెట్లో 48శాతం వాటాను సబ్సిడీ రూపంలో అందించేది. ఈ రెండో సబ్సిడీ విలువ (2008-09కిగాను) రూపాయల్లో రూ.2,98,080 కోట్లు. ఎరువులు, సాగునీరు, ఇతర అవసరాలన్నింటికీ కలిపి మన దేశం ఇదే కాలంలో ఇచ్చిన సబ్సిడీ రూ.1,33,428కోట్లు మాత్రమే. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌, డబ్ల్యుటిఓ షరతులను అనుసరించి మనదేశం వ్యవసాయ సబ్సిడీని క్రమంగా తగ్గిస్తూ వస్తుంటే, ఐరోపా మాత్రం 2006 నుంచి పెంచుతూ పోయింది. దీనివల్ల అక్కడి వాటితో మన వ్యవసాయ ఉత్పత్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ పడే అవకాశం లేదు. మన దేశంలోని వ్యవసాయ ఉత్పత్తులను బతికించుకోవాలంటే వాణిజ్య సుంకాలు తప్పనిసరి. ఎఫ్‌టిఎలో ఈ సుంకాలను సున్నా స్థాయికి లేదా సున్నాకు తగ్గించాలన్నది ప్రధాన షరతు. మన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిపోనుంది. (ఎఫ్‌టిఎ అమలైతే 2020 నాటికి ప్రాథమిక వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎవరు ఎక్కువగా లాభపడబోతున్నారో పట్టిక-1లో చూడండి.)
మన దేశంలో ఉపాధి కల్పనలో వ్యవసాయనిదే అగ్రస్థానం. గత కొన్నాళ్లుగా వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలు, వాతావరణ అననుకూల పరిస్థితుల వల్ల వ్యవసాయాన్ని వదిలి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. 2010 జూన్‌లో విడుదలైన ఎన్‌ఎస్‌ఎస్‌ఒ 64వ రౌండ్‌ సర్వేను అనుసరించి ఉపాధికోసం పట్టణ ప్రాంతానికి వచ్చిన మొత్తం వలసల్లో గ్రామీణులు 57శాతంగా ఉన్నారు. వీరిలో కూడా మహిళలే అధికం. పట్టణ ప్రాంతాలకు వలస వచ్చిన ప్రతి వెయ్యి మందిలో గ్రామీణ మహిళలు 456 ఉంటే, పురుషులు 259మంది ఉన్నారు. ఇయు ఎఫ్‌టిఎ అమలు జరిగితే వ్యవసాయం ఏ మాత్రం లాభం చేకూర్చేదిగా ఉండే అవకాశం లేదు. ఇది మరిన్ని వలసలను ప్రోత్సహిస్తుంది. పట్టణ ప్రాంతాలను నిరుద్యోగ సైన్యంతో ముంచెత్తుతుంది. దీని పర్యవసానం పట్టణ ప్రాంతాల్లో కూలి రేట్ల దగ్గర్నుంచి, పారిశ్రామిక వేతనాల పతనం వరకు ఉంటుంది.
వ్యవసాయం దెబ్బతిన్న రోజుల్లో కూడా గ్రామీణ ప్రాంతాలను ఆదుకుని నిలబెట్టింది డెయిరీ పరిశ్రమ. ఈ ఏడాది ఇది కూడా దాడికి గురికాబోతోంది. డెయిరీ రంగాన్ని తమ కంపెనీల కోసం తెరవాలని అమెరికా మంత్రి ఒకవైపు బెదిరిస్తుంటే, మరోవైపు ఐరోపా దేశాలు డెయిరీని ఎఫ్‌టిఎలో చేర్చాలని ఒత్తిడి తెస్తున్నాయి. డెయిరీ పరిశ్రమకు అమెరికా, ఇయు ఇస్తున్న సబ్సిడీలతో అవి అవసరానికి మించిన ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాయి. కేవలం ఎగుమతిని ఉద్దేశించే ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు కూడా తయారయ్యాయి. వీటికి అత్యవసరంగా మార్కెట్లు కావాలి. భారతదేశం వీటి ప్రాధాన్యతల్లో మొదటిదిగా ఉంది. ఇప్పటి దాకా మన దేశం పాలపౌడర్‌ను మాత్రమే దిగుమతి చేసుకునేది. పచ్చిపాలు దిగుమతి జాబితాలో లేదు. ఐరోపా అయితే ఏకంగా పచ్చిపాలనే మనదేశానికి ఎగుమతి చేస్తానంటోంది. ఇందుకోసం డెయిరీ రంగంలోకి ఎఫ్‌డిఐని అనుమతించాలని ఒత్తిడి తెస్తోంది. ఇవి అమలు జరిగితే వాటి పెట్టుబడులతోనూ, సాంకేతిక అంశాలతోనూ, వ్యాపారంలోనూ దేశీయ డెయిరీ పరిశ్రమ పోటీ పడలేదు. (వాటి వ్యాపార సామర్థ్యం కోసం పట్టిక-2 చూడండి) ఫలితంగా డెయిరీ, డెయిరీ ఉత్పత్తుల మీద ఆధారపడ్డ తొమ్మిది కోట్ల మంది ఉపాధి అభద్రతలో పడే ప్రమాదం పొంచి ఉంది. సెంటర్‌ ఫర్‌ ట్రేడ్‌ అంచనా ప్రకారం ఈ తొమ్మిదికోట్ల మందిలోనూ మహిళల సంఖ్య 7.5కోట్లుగా ఉన్నది.
దేశ జిడిపిలో 4శాతంగా ఉన్న చిల్లర వర్తకం కూడా తాజా ఒప్పందాలు, ఎఫ్‌టిఎలతో బలిపీఠంపైకి ఎక్కింది. దొడిదారిన దేశంలోకి ప్రవేశించిన వాల్‌మార్ట్‌ రెండేళ్లలోనే ఏర్పాటు చేసిన బ్యాంక్‌ ఎండ్‌ సప్లయి చెయిన్‌ను చూస్తే దేశంలో ఉన్న బడా రిటైలర్లు కూడా గడగడలాడిపోతున్నారు. నేరుగా అనుమతిస్తే దాని విజృంభణను ఎవ్వరూ తట్టుకోలేరన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి వాల్‌మార్ట్‌ సంస్థలు ఐరోపా నుంచి కూడా మన దేశంలోకి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. వీటిని అనుమతిస్తే ఈ రంగంపై ఆధారపడ్డ 4.5కోట్ల మంది ఉపాధి కూడా అభద్రత జాబితాలోకి చేరిపోనుంది.
ఈ విధంగా కోటాను కోట్ల మంది ఉపాధిని దెబ్బతీయడమే కాదు వారి ఆరోగ్యాన్ని కూడా హరించే దిశగా ఒప్పందాలు సాగుతున్నాయి. ఇండో-అమెరికా సిఇఓ ఒప్పందం, ఐరోపాతో ఎఫ్‌టిఎను అనుసరించి మనదేశం పేటెంట్‌ చట్టాన్ని తిరగరాయాలి. వారు ప్రతిపాదించే ట్రిప్స్‌ ఒప్పందాన్ని అంగీకరించాలి. ఇదే జరిగితే ఒక్కో మందుపై ఉత్పత్తి చేసిన కంపెనీకి 22ఏళ్లపాటు గుత్తాధిపత్యం ఉంటుంది. దీనికి జెనరిక్‌ రూపం రావాలంటే 22ఏళ్లు ఆగాల్సిందే. మందు ధరపై కూడా ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదు. అప్పుడు కొనగలిగినవాడికే ఆరోగ్యం. సామాన్యుడికి ఇది సాధ్యమయ్యే పని కానే కాదు. సిపిఐ(ఎం), ఇతర వామపక్షాలు చెబుతూ వస్తున్నట్లుగా యుపిఎ-2 కుదుర్చుకోబోతున్న ఈ విధానాలన్నీ సామాన్య ప్రజల పాలిట పెనుశాపంగా మారబోతున్నాయి. ఈ పెనుశాప భారాన్ని భరిస్తూ తనకై తాను సంక్షోభంలో కూరుకుపోవడమా, దీనిని తిప్పికొట్టి ఉపాధిని, ప్రశాంతమైన ఆరోగ్యకర జీవితాన్ని కాపాడుకోవడమా అనేది సామాన్యులే తేల్చుకోవాలి.
<b>ప్రాథమిక ఉత్పత్తుల మార్కెట్లో వాటాలు (పట్టిక-1)</b>
<b>ఐరోపా మార్కెట్లో భారత్‌ వాటా (2020నాటికి)</b>
ప్రాథమిక వాటా తుది వాటా విలువ మిలియన్‌డాలర్లలో
ప్రాథమిక ఉత్పత్తులు 0.3 0.3 39
తృణధాన్యాలు 1.2 1.2 7
ఇతర పంటలు 0.6 0.6 2
జంతుసంబంధ ఉత్పత్తులు 0.1 0.1 1
భారత మార్కెట్లో ఇయు వాటా (2020 నాటికి)
ప్రాథమిక ఉత్పత్తులు 4.9 16.7 5128
జంతుసంబంధ ఉత్పత్తులు 7.5 10.4 150
తృణధాన్యాలు 17.6 23.5 133
ఇతర పంటలు 4.8 5.7 80

<b>ప్రపంచ డెయిరీ మార్కెట్‌ లీడర్లు (పట్టిక-2)</b>
<b>కంపెనీ దేశం 2004నాటికి అమ్మకాలు(బిలియన్‌ డాలర్లలో)</b>
నెస్లీ స్విట్జర్లాండ్‌ 17.5
డీన్‌ ఫుడ్స్‌ అమెరికా 7.6
డెనాన్‌ ఫ్రాన్స్‌ 7.4
డెయిరీ ఫార్మర్స్‌ ఆఫ్‌ అమెరికా అమెరికా 7.3
ఫాంటెర్రా న్యూజీల్యాండ్‌ 7.3
ఆర్ల ఫుడ్స్‌ డెన్మార్క్‌/స్వీడన్‌ 6.7
లాక్టలిస్‌ ఫ్రాన్స్‌ 6.5
యూనిలివర్‌ నెదర్లాండ్స్‌/యుకె 6.2
క్రాఫ్ట్‌ఫుడ్స్‌ అమెరికా 5.5
పర్మలట్‌ ఇటలీ 5.3
రాయల్‌ ఫైర్స్‌ల్యాండ్‌ ఫుడ్స్‌ నెదర్లాండ్స్‌ 5.3
బొంగ్రెయిన్‌ ఫ్రాన్స్‌ 4.8
మీజి డెయిరీస్‌ జపాన్‌ 4.2
కాంపినా నెదర్లాండ్స్‌ 4.1
మోరినాగా మిల్క్‌ జపాన్‌ 4.0
<b> జగదీష్‌</b>

1 comment: