ఒబామా చేత ఎదిగిన (ఎమర్జ్‌డ్) దేశంగా పిలవబడ్డ భారత్ మునిగిన (సబ్‌మర్జ్‌డ్) దేశంగా పిలిపించుకునే రోజులు దగ్గర పడ్డాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తాజాగా విడుదలైన గణాంకాలు చెబుతోన్న వాస్తవాలు దీనినే సూచిస్తున్నాయి. దేశాల మధ్య వడ్డీచెల్లింపులు, సరుకులు, సేవలు, ఇతర వాణిజ్య లావాదేవీలను గణించే కరెంటు ఖాతాలో లోటు ఏకంగా 72శాతం పెరిగింది. ఎగుమతులు తగ్గిపోయి, దిగుమతులు పెరిగినప్పుడు ఇది సంభవిస్తుంటుంది. ప్రపంచ సంక్షోభం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో మన దేశం నుంచి ఎగుమతులు పెరిగాయి.
అది కూడా శాతాల్లో పెరుగుదల తప్ప పరిమాణంలో దిగుమతులతో పోటీ పడే స్థితిలో లేదు. 2009 ఏప్రిల్-నవంబర్ ఆరు నెలల కాలానికి, 6,960 కోట్ల డాలర్ల మేర ఉన్న వాణిజ్యలోటు, 2010లో ఇదే కాలానికి 8,160 కోట్ల బిలియన్ డాలర్లకు చేరింది. ఎగుమతులు భారీగా తగ్గడంతో ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా దేశీయ పారిశ్రామిక వేత్తలు తమ పరిశ్రమల ఆధునీకరణకు పూనుకున్నారు. ఇందుకోసం విదేశాల నుంచి యంత్రాలను విపరీతంగా దిగుమతి చేసుకుంటున్నారు. వీటిని కొనుగోలు చేసేందుకు విదేశీ మారకద్రవ్యాన్ని ఉపయోగించాల్సి వస్తోంది. మరోవైపు ఫ్యూచర్‌ట్రేడర్ల పుణ్యమా అని అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. దీంతో చమురు బిల్లుకూడా తడిసిమోపడవుతోంది. ఇవన్నీ కరెంటు ఖాతా లోటు ఒక్కసారిగా పెరిగేందుకు
కారణమయ్యాయి. ఇదే పరిస్థితి మున్ముందు కూడా కొనసాగితే జిడిపిలోనే మూడుశాతానికి ఈ లోటు చేరే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. వాణిజ్యలోటు పెరుగుతున్న కొద్దీ విదేశీమారక ద్రవ్య నిల్వలపై అది ప్రభావం చూపిస్తుంటుంది. విదేశీ మారకద్రవ్యం కొరత ఏర్పడితే దానిని విదేశాల నుంచి కొనుక్కోవాలి. లేదంటే ఐఎంఎఫ్ పెట్టే షరతులకు ఒప్పుకుంటూ అప్పులు తెచ్చుకోవాలి. గత ఆర్థిక సంవత్సరం కంటే అధికంగా దేశంలోకి వచ్చిన ఎఫ్‌ఐఐల వల్ల మనకు డాలర్లు సమకూరాయి.
అప్పులకు వెళ్లాల్సిన పరిస్థితి లేదు. అదే సందర్భంలో డాలర్లు అమితంగా దేశంలోకి రావడం వల్ల రూపాయి విలువ బలపడనారంభించింది. ఇది క్రమంగా పెరుగుతూ పోవడం వల్ల మన ఎగుమతులు దెబ్బతింటున్నాయి. దిగుమతులు మరింత చవకగా మారిపోతున్నాయి. ఇది వాణిజ్యలోటును, కరెంటు ఖాతా లోటును మరింత పెంచేందుకే తోడ్పడుతుంది. ఎఫ్‌ఐఐల ద్వారా వచ్చే డబ్బు ఉత్పత్తిలో అభివృద్ధికి గ్యారెంటీనివ్వదు. ఇది హాట్ మనీ. క్షణాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లిపోతుంది. ముఖ్యంగా దాని మాట వినట్లేదనుకున్నప్పుడు అది దేశాల ఆర్థిక వ్యవస్థలనైనా కుప్పకూల్చేస్తుంది. లాభానికి తప్ప దేనికీ అది కట్టుబడి ఉండదు. అలాంటి హాట్‌మనీ ఊతకర్రగా ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు యుపిఎ-2 పాలకులు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం ఆ 'హాట్‌మనీ'ని నడిపే మార్కెట్‌శక్తులను సంతృప్తి పరిచే చర్యలను ప్రభుత్వం చేపడుతోంది. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోతున్నా ప్రకృతిమీద, దిగుబడి మీద భారం వేసి ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇందులో భాగమే.
z`ఈ రెండు పరిణామాలు రోజుకు రూ.20లు కూడా ఖర్చు చేయలేని 80శాతం ప్రజానీకానికి ఏ మాత్రం మేలు చేయకపోగా, తీవ్రమైన భారాన్ని మోపేవి మాత్రమే. పరిస్థితి తీవ్రత చేయిదాటిపోతున్నా మన యుపిఎ-2 పాలకులు మాత్రం వాషింగ్టన్ ప్రవచిత ఆర్థిక విధానాలనే ఇంకా అమలు చేస్తూ, దానితోనే అంటకాగుతూ ఉండడం ఆందోళనకర పరిణామం. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఛాయలు ఇంకా పూర్తిగా పోలేదు. మన ఎగుమతులు అమ్ముడుపోవట్లేదు. అలాంటప్పుడు లక్ష్యాలు పెట్టుకుని ఎగుమతులకు పోయేకన్నా దేశీయంగా డిమాండు పెంచే చర్యలను చేపట్టవచ్చు. దీనికోసం ప్రజల కొనుగోలుశక్తిని పెంచే పథకాలు ఉపయోగపడతాయి. ద్రవ్యలోటు పెరుగుతుందనే సాకు చూపెట్టి ప్రభుత్వం ఇలాంటి పథకాలకు నిధులు మంజూరు చేయ నిరాకరిస్తోంది. ఇందుకు భిన్నంగా మన పొరుగునే ఉన్న చైనా దేశీయ డిమాండ్‌ను పెంచేందుకు, ఆ దేశ ప్రజల కొనుగోలుశక్తిని రెట్టింపు చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఎగుమతుల్లో చైనా నెంబర్ వన్. మన దేశం రెండంకెల స్థానంలో ఉంటోంది. ఎగుమతులు పడిపోయినా తాను చేపట్టిన కార్యక్రమాల వల్ల అది నిలదొక్కుకుంది. మన దేశం మాత్రం కరెంటు ఖాతా లోటుతో సతమతమవుతోంది. కాబట్టి విధానాల్లో ఉన్న రుగ్మతలను ఎన్ని పై పై లేపనాలు పూసినా రోగం మాత్రం తగ్గదు. అదింకా ముదిరిపోతుంది. ఇదిలా ఉంటే సంక్షోభం నేపథ్యంలో మన దేశ పరిశ్రమలకు సరైన ఆర్డర్లు రావట్లేదు. పారిశ్రామికోత్పత్తి క్రమంగా పడిపోతున్నది. పారిశ్రామికవేత్తలంతా ఆధునీకరణవైపు మొగ్గుచూపారు. ఉద్యోగులను తొలగించారు. దీనిని నివారించడమో, లేదా బతుకుదెరువుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడమో జరగడం లేదు. నిరుద్యోగ సైన్యం పెరిగేందుకు దోహదపడే ప్రమాదకర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఐరోపా, అమెరికాతో కుదుర్చుకునేందుకు యుపిఎ-2 పరిగెడుతోంది. ఈ ఎఫ్‌టిఎల వల్ల డెయిరీ, మత్స్య ఉత్పత్తి, చిల్లరవర్తకం మీద ప్రభావం పడి 14కోట్ల మంది ఉపాధి ప్రమాదంలో పడుతుందని అంచనా. వెరసి వర్తమాన భారత ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు పతనం, నిరుద్యోగం పెరుగుదల, వాణిజ్యలోటు ఏకకాలంలో ప్రతికూల లక్షణాలను ప్రతిబింబిస్తున్నాయి. కరెంటు ఖాతా లోటు కూడా వీటికి జత కలిసింది. కరెంటు ఖాతా లోటు ఎంత ఎక్కువగా పెరిగితే ఆ దేశంలో అంత తొందరగా సంక్షోభం వస్తుందని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నేర్పిన పాఠం. మనదేశం ఇప్పుడు అలాంటి ప్రమాదపుటంచుల్లో ఉంది.ఇప్పటికైనా మన పాలకులు కళ్లు తెరవాలి.
not only india, US also has to face a lot of crunch in employment nd financial sectors in 2012.Due to this our indian employees has to come back home.
ReplyDelete