Tuesday, January 11, 2011

కామ్‌గా ఉందాం లేదా తరలిపోదాం

  • రాజధాని పారిశ్రామికవేత్తల మనోగతం
  • ఆందోళనకారులతో రాజీకి ప్రయత్నాలు
  • ప్రత్యామ్నాయంగా వైజాగ్‌, గుంటూరులో స్థలాల పరిశీలన
  • త్రిశంకు స్వర్గంలో మధ్యతరహా పరిశ్రమలు

హైదరాబాద్‌ నగరంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, వేర్పాటువాదుల దుందుడుకు చర్యలు పారిశ్రామికవేత్తలను బేజారెత్తిస్తున్నాయి. అయితే వారెవ్వరూ ఇప్పుడే బయటపడేందుకు సిద్ధంగా లేరు. అలాగని, భయాందోళనలనూ విడిచిపెట్టలేదు. ప్రత్యామ్నాయాలను వెతుక్కోవటమూ మానేయలేదు. ఏదో ఒక్క రంగం అని కాకుండా, దాదాపు అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి. 'ఇది ప్రజా ఉద్యమంగా కనిపించట్లేదు. ఆందోళనకారులు అతికొద్ది మందితో ముఠాలుగా ఏర్పడి విధ్వంసానికి పూనుకుంటున్నారు. వారు పిలుపు ఇచ్చినప్పుడల్లా బంద్‌ చేయకపోతే ఆస్థి పరంగా ఎలాంటి నష్టం సంభవిస్తుందో తెలియక తీవ్రంగా సతమత మవుతున్నాం.' అని బాలానగర్‌లోని మధ్యతరహా పారిశ్రామి కవేత్త ఒకరు ప్రజాశక్తితో చెప్పారు. ప్రజాశక్తి కలిసిన వారిలో దాదాపు అందరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
'కామ్‌గా ఉందాం'
నగరం, నగర శివారుల్లోని పరిశ్రమాధిపతులంతా చెబుతున్నది ఇదే. కామ్‌గా ఉందాం... ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనే ఐడెంటిటీ చెప్పుకుని
మరింత అనిశ్చితిని పెంచుకోవడం కంటే ఇదే ఉత్తమమైన మార్గమని వారు అభిప్రాయపడుతున్నారు. 'ఆందోళనలు చేసుకోండి. నెలలో ఒకరోజు బంద్‌ చేయాలని చెప్పండి. మేం సహకరిస్తాం. కానీ చీటికీ మాటికి బంద్‌లు అనకండి. అది ఉత్పత్తిపై, నిర్వహణ పెట్టుబడిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మా పని మేం చేసుకునే విధంగా సహకరించండి' అని ఇప్పటికే వివిధ పరిశ్రమ అసోసియేషన్ల నుంచి ఆందోళనకారులకు విజ్ఞప్తులు వెళ్లాయి. బాలానగర్‌ ఇండిస్టియల్‌ ఎస్టేట్‌లోని పరిశ్రమలన్నీ కలిసి ప్రత్యేక సెక్యూరిటీని పెట్టుకున్నాయి. ఆందోళనకారులు వస్తే సమాచారం ఇచ్చే విధంగానూ, వారిని అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శుల వద్దకు తీసుకెళ్లే విధంగానూ సెక్యూరిటీకి పనిని అప్పగించారు. 'సాధ్యమైనంత మేర వారితో రాజీ పడేందుకే ప్రయత్నిస్తున్నాం. కుదరకపోతే బందుకు వెళ్తున్నాం.' అని ఓ పారిశ్రామికవాడ అసోసియేషన్‌ ఛైర్మన్‌ చెప్పారు. ఇలా చేయడం వల్ల చివరగా ఒక బంద్‌ను తమ పారిశ్రామిక వాడలో నివారించగలిగామని ఆయన చెప్పారు.

ఒక్కో రంగానిది ఒక్కో సమస్య
నగరం శివారుల్లో అనేక రంగాలకు సంబంధించిన పరిశ్రమలున్నాయి. ఉషా, ఖైతాన్‌ కంపెనీల ఆధారంగా అనేక అనుబంధ పరిశ్రమలు బాలానగర్‌ ప్రాంతంలో ఉన్నాయి. ఆ రెండు పెద్ద కంపెనీలు కదిలితే తప్ప మిగిలినవి కదలలేని పరిస్థితి. అందుకే భరించగలిగినంత నష్టాలకు సిద్ధపడుతూనే, ఇక్కడే ఉండేందుకు, ఉషా కంపెనీని కూడా ఇక్కడే ఉంచేందుకు అనుబంధ పరిశ్రమలన్నీ ప్రయత్నిస్తున్నాయి. మరికొన్ని ప్రభుత్వరంగ సంస్థలపై ఆధారపడ్డ పరిశ్రమలున్నాయి. రెడ్డీ ల్యాబ్స్‌ తరలివెళ్లిపోతే ఫార్ములేషన్‌లో తోడ్పడే అనుబంధ కంపెనీలు సైతం తమ ఎక్విప్‌మెంట్‌ను తరలించుకోవాల్సిన దుస్థితి ఏర్పడబోతోంది. 'మధ్య తరహా పరిశ్రమలు తరలి వెళ్లాలనుకోవు. కానీ ఒక్కసారి వెళ్లడం ప్రారంభిస్తే ఎన్ని నష్టాలు, కష్టాలు వచ్చినా అవి తమ నిర్ణయాన్ని మార్చుకోవు. వాటిని ఎవరూ ఆపలేరు కూడా.' అని ఓ సొసైటీ నాయకుడు చెబుతున్నారు. వేర్పాటు వాద ఆందోళన వల్ల సిఐఐ ఇక్కడ పెట్టాల్సిన పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ వాయిదా పడిపోయింది. ఇప్పుడు గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ మీట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు, ఆర్థిక ఉత్పత్తులకు సంబంధించిన అనేక ఒప్పందాలు ఇక్కడ జరుగుతాయి. ఇది కూడా వాయిదా పడితే రాష్ట్రం తీవ్రంగా నష్టపో తుందని సిఐఐ రాష్ట్ర అధ్యక్షులు వై.హరిశ్చంద్రప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ సెక్యూరిటీ అంతంతమాత్రమే
ఆందోళనల నేపథ్యంలో సైబరాబాద్‌ పారిశ్రామికప్రాంతంలో భద్రత కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు విభాగం పని అంతంత మాత్రంగానే ఉందనే విమర్శలున్నాయి. 'ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినప్పుడు వీలైనన్ని ఎక్కువ సందర్భాల్లో పరిశ్రమల సంఘాలతో మాట్లాడాలి. నిర్దిష్ట చర్యల కోసం స్థానిక సొసైటీలను గానీ, ఐలా కమిటీలను గానీ కలిసి అభిప్రాయాలు సేకరించాలి. ఈ రంగంలో ఉన్న ప్రభుత్వ విభాగాలతో ప్రత్యేకంగా మాట్లాడాలి. ఇప్పటి వరకు అలాంటిదేమీ జరగలేద'ని పరిశ్రమ అధికారులు చెబుతున్నారు. అయితే అక్కడక్కడ రెండు మూడు సార్లు ఎక్కువ పెట్రోలింగ్‌ను మాత్రం నిర్వహిస్తున్నట్లు కొద్ది మంది పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు.
అప్పుల్లో వస్తూత్పత్తి రంగం
సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ కొంతలో కొంత బెటర్‌ అనుకుంటే, వస్తూత్పత్తి రంగం మాత్రం ఇరువైపులా వేర్పాటు వాదుల ఆందోళనలతో అడకత్తెరలో పోక చెక్కలా నలిగిపోయింది. చర్లపల్లిలోని ఓ ప్లాస్టిక్‌ కుర్చీల కంపెనీ రా మెటీరియల్‌ తెచ్చుకుని కుర్చీలను తయారు చేసింది. వైజాగ్‌లోని డీలర్‌కు పంపుదామనేసరికి నగరంలో వరుస బందుల వచ్చి ట్రాన్స్‌పోర్టు అస్తవ్యస్తమైపోయింది. సాధ్యంకాలేదు. ఇక్కడ సద్దు మణిగిందనే సరికి వైజాగ్‌లో సమైక్యాంధ్ర ఆందోళన ప్రారంభమై అక్కడా బంద్‌ జరిగింది. ఉత్పత్తి పేరుకుపోయింది. నిల్వఉంచేందుకు స్థలం లేదు. ఉత్పత్తి నిలిచిపోయింది. యంత్రాలు ఆగిపోయాయి. కార్మికులకు పనిలేకుండా పోయింది. 'ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పారిశ్రామికవేత్తలు తెచ్చుకునే వర్కింగ్‌ క్యాపిటల్‌ భారంగా మారిపోతోంది. ఉత్పత్తి సకాలంలో డెలివరీ అయిపోతే రుణభారం పెరిగేది కాదు. కానీ ఇప్పుడు ప్రతి పరిశ్రమా వర్కింగ్‌క్యాపిటల్‌పై రుణాల భారాన్ని మోయాల్సిన దుస్థితి ఏర్పడింది.' అని రంగారెడ్డి జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ సి.రామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయిననూ ప్రత్యామ్నాయం వెతుక్కోవలే..
'నాకు బాలానగర్‌, చర్లపల్లిలో మొత్తం మూడు యూనిట్లున్నాయి. వేర్పాటు వాద ఆందోళనల వల్ల మున్ముందు ఇక్కడ బతకడం కష్టం కావొచ్చు. ఎంతకైనా మంచిదని ప్రకాశం జిల్లా వెళ్లి స్థలాలను పరిశీలించి వచ్చా' అని ప్లాస్టిక్‌ ఇండిస్టీ అధిపతి ఒకరు చెప్పారు. ఫార్మా కంపెనీలన్నీ ఇప్పుడు వైజాగ్‌వైపు చూస్తున్నాయి. వైజాగ్‌లో ఫార్మాకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా స్థలాన్ని గతంలో ప్రకటించింది. ఆ స్థలాన్ని రామ్‌కీకి ఎస్‌ఇజడ్‌ రూపంలో కేటాయించింది. ఇది కాకుండా లీఫార్మా తదితర కొన్ని కంపెనీలు కలిసి ప్రభుత్వానికి తమ ఆందోళనను వ్యక్తం చేసి చిన్న ఫార్మా పరిశ్రమల కోసం ప్రత్యేక స్థలాన్ని గతంలోనే ప్రకటింపచేసుకున్నాయి. అయితే ఇదింకా కొలిక్కి రాలేదు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించట్లేదు కాబట్టి ఎలాగైనా వైజాగ్‌లో స్థలాన్ని సంపాదించాలని ఫార్మా కంపెనీలు భావిస్తున్నాయి. 'మా కొలీగ్స్‌ ఇప్పుడు తమ బిజినెస్‌ను ఎలా ఎక్కడ షిఫ్ట్‌ చేయాలా అనే పనిలో బిజీగా తిరుగుతున్నారు. జనరల్‌గానే అందరి ఫస్ట్‌ ఆప్షన్‌గా వైజాగ్‌ ఉంది.' అని కృష్ణారెడ్డి అనే పారిశ్రామికవేత్త చెప్పారు.
బెంగుళూరు, ఢిల్లీ లేదా వైజాగ్‌
ఐటి పరిశ్రమలు ఎంచుకుంటున్న ప్రత్యామ్నాయ ప్రాంతాలివే. 2.5లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కల్పిస్తున్న రాజధాని ఐటి పరిశ్రమ నేడు వరుస బంద్‌లతో అనేక ఇబ్బందులను ఎదుర్కుంటోంది. 'బంద్‌ వల్ల కంపెనీకి ఉద్యోగి వస్తాడో రాడోనన్న భయం పట్టుకుంది. ఒకవేళ ఉద్యోగి రాలేకపోతే ఏమీ అనలేం. అతనూ ఏమీ చేయలేడు. వరుస బంద్‌లతో ఒక ప్రాజెక్టు మీద పని చేసే వారి సంఖ్య ఒక్కో మారు 20శాతానికి కూడా మించట్లేదు. డెలివరీ ఆలస్యమై క్లయింట్లు తదుపరి కాంట్రాక్టులు ఇవ్వాలా? వద్దా? అని అడుగుతున్న పరిస్థితి. అందుకే టిసిఎస్‌, విప్రో వంటి సంస్థలైతే అనేక ప్రాజెక్టులను బెంగుళూరు ఢిల్లీలకు షిఫ్ట్‌ చేసేశాయి.' అని ఇన్వెన్సిస్‌ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ రమం చెబుతున్నారు. ఒకవేళ ఐటి ఇండిస్టీలు యూనిట్లను షిఫ్ట్‌ చేస్తే ఐటి ఇండిస్టీ కంటే ముందుగా, వీటికి లీజుకిచ్చిన ప్రాపర్టీ ఓనర్లు తీవ్రంగా నష్టపోనున్నారు. 'మా ఊరికి కూడా బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ వచ్చేసింది. పెన్‌డ్రైవ్‌లో సమాచారాన్ని పట్టుకెళ్లి, మా ఇంటి నుంచే ఇండిస్టీని నడిపేయగలం. ప్రాపర్టీ ఓనర్లకే నష్టం' అని ఓ పారిశ్రామికవేత్త చెప్పారు. ఈ రాజకీయ అనిశ్చితి ఇలాగే కొనసాగితే ప్రాజెక్టులు తగ్గి, కంపెనీలు షిఫ్ట్‌ అయి జాబ్‌లాస్‌కు కారణాలుగా మారే ప్రమాదం ఉందని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎక్స్‌పోర్టర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎం.నర్సింహారావు చెబుతున్నారు. 'వచ్చే అయిదేళ్లలో హైదరాబాదు ఐటి పరిశ్రమ లక్ష కోట్లకు వెళ్తుందని అంచనావేశాం. ఇలాంటి అడ్డంకులు వస్తే సాధ్యం కాదు' అని ఆయన అంటున్నారు.
జగదీష్‌

1 comment:

  1. విషయ సేకరణ బాగుంది. చక్కగా రాశారు. రాస్ట్రం నుంచి విడిపోవాలన్న వాదాన్ని వేర్పాటు అనరు. ప్రత్యేక వాదం అనిగానీ విభజన వాదం అనికానీ అనొచ్చు. దేశం నుంచి విడి పోతేనే వేర్పాటు అనాలి.

    ReplyDelete