Thursday, December 30, 2010

కార్పొరేట్లకు కలిసొచ్చిన 'సంక్షోభం'

2008లో తలెత్తిన ప్రపంచ సంక్షోభం ప్రపంచాన్ని కుదిపేస్తుంటే ముఖేష్‌ అంబానీ నెదర్లాండ్స్‌కు చెందిన లైయోన్డెల్‌బాసెల్‌ అనే రసాయన కంపెనీని కొనేశారు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద రసాయన పరిశ్రమాధిపతిగా మారిపోయాడు. ప్రస్తుతం ఈ రసాయన పరిశ్రమల ఆదాయం 8000 కోట్ల డాలర్లు. రూపాయల్లో 3.60లక్షల కోట్లు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌కు మూడున్నర రెట్లు. ఒక్క ముఖేష్‌ అంబానీయే కాదు దేశంలో అత్యంత ధనిక గుత్తాధిపతులందరూ తమ ఆస్తులు విపరీతంగా పెంచుకోవడం, ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలను కొనడం సంక్షోభానంతర కాలంలో నిరాఘాటంగా కొనసాగించారు. ఈ కోవలోకే అవంతా కూడా వస్తుంది. అవంతా గ్రూపు తన ఉపాంగాల ద్వారా విదేశీ కంపెనీలను విలీనం చేసుకోవడమో, కొనడమో చేసింది. సంక్షోభం ముందు నుంచే ఆరంభించి 2010 చివరి నాటికల్లా బెల్జియం పావెల్స్‌ను, హంగేరియన్‌ గాన్జ్‌ను, ఐర్లాండ్‌ మైక్రోసోల్‌ను, ఫ్రాన్స్‌ను సోనోమాత్రాను, అమెరికాకు చెందిన ఎంఎస్‌ఇ పవర్‌ సిస్టమ్స్‌ను తన గుప్పిట్లోకి...

Tuesday, December 21, 2010

మన్మోహన్‌ పీడ కల

మన్మోహన్‌కి ఒక కల వచ్చిందంట. ఆయన కోర్టులో ఉన్నడంట. బోనులో కూర్చున్నడంట. చేతులకు బేడీలు ఉన్నయంట. బాడీ మీద గీతల చొక్కా ఉందంట. ఆయన పక్కనే సరిగ్గా అట్లనే ఇంకొడున్నడంట. కళ్లు నలిపి చూస్తే, అప్పుడు కనిపించిండంట. టెలికాం కింగంట. 2జికి రాజంట. ఆయన నవ్విండంట. ఈయన ఏడ్చిండంట. ఏరు మన్మోహన్‌ అని ఎవరో పిలిచిన్రంట. మన్మోహన్‌ ఇంకా ఏడ్చిండంట. కేర్‌ మన్నడంట. ఉంగా ఉంగా అన్నడంట. జెపిసి వద్దే అని అంటున్నడంట. ఎక్కిళ్లుపట్టిండంట. మన్మోహన్‌... అని మళ్లీ గట్టిగా ఎవరో పిలిచింరంట. కోర్టు పాయే... బేడీలు పాయే... బోను పాయే... గీతల చొక్కా పాయే... రాజా గాయబాయే... మన్మోహన్‌... అని మళ్లీ పిలిచింరంట. తెల్లగా పాలిపోయిన మొహంతోని సోనియమ్మ కనిపించిందంట. మేడం జెపిసి వద్దు మేడం. కలనే భయంకరంగా ఉంది మేడం. ప్లీజ్‌ మేడం. జెపిసి వద్దు మేడం అని అంటున్నడంట. అప్పుడా మేడం మన్మోహన్‌జీ కలగంటున్నావ్‌. మనం ప్లీనరీలో ఉన్నాం. నువ్వు కునుకు తీసావంతే... చూడు చుట్టు మనోళ్లే ఉన్నారు అని అన్నదంట. మన్మోహన్‌ గట్టిగా ఊపిరి పీల్చుకుని 'కలనే ఇంత భయంకరంగా ఉంది. ఇదే నిజమైతే...?' అని ఆలోచించిండంట. వెంటనే మైకు దగ్గరకి ఉరికి 'ప్రధానిగా ఉన్న నన్ను ఎవ్వరు అనుమానించొద్దు. నేను సచ్చీలుణ్ని కావాలంటే కోరల్లేని  పిఎసి ముందు హాజరయితా, నిజాయితి నిరూపించుకుంటా. మళ్లీ చెబుతున్న జెపిసి మాత్రం వద్దు. జెపిసి మాత్రం వద్దు' అని చెప్పి మళ్లీ సోనియా మేడం దగ్గరబోయి కూసున్నడంట.

ధరలు పెంచిన దొంగలెవరు?

హన్నన్నన్న... పొద్దున లేచి వార్తలు చూస్తుంటే దిమ్మ దిరిగిపోయిందనుకో.. సోనియమ్మ ధరలు తగ్గించాలంటది. మన్మోహనేమో ఆకలితో ఏ భారతీయుడూ పడుకోవద్దంటాడు. ఏమైనా చేసి ధరల గొంతు పిసికేయాలని ఆర్‌బిఐకి ప్రణబ్‌ చెబుతున్నాడు.. చూస్తుంటే వీరంతా ధరలపై యుద్ధానికి పోయినట్లే కనిపిస్తుంది. మరి ఇప్పటి దాకా ధరలు పెంచిందెవరు? వీళ్లంతా పోలీసులైతే ఆ దొంగలెవరు? నాకు తెలిసి ధరలు పెంచేది. తగ్గించేది ప్రభుత్వమే. కాంగ్రెస్సోళ్లంతా ఇప్పుడు ఎవరిపై యుద్ధం చేస్తున్నారు? వాళ్లున్నది ప్రభుత్వంలోనా? ప్రతిపక్షంలోనా? ప్రభుత్వం వాళ్లే నడుపుతారు. ప్రతిపక్షం కూడా వాళ్లే. రజినీకాంత్‌ సినిమాలోలాగా హీరో వాళ్లే, విలన్‌ వాళ్లే... ద్విపాత్రాభినయం...
రోబో సినిమాను ఎంజాయ్  చేయొచ్చుగానీ, కాంగ్రెస్‌ ద్విపాత్రాభినాయాన్ని భరించడం కష్టం. పెట్రోలు ఛార్జీలు వాటంతటవే పెరిగిపోయే విధంగా చట్టాన్ని మార్చేశారు. పెట్రోలు ఛార్జీలు మేం పెంచట్లేదని చెబుతున్నారు. రోజుకు 6000 టన్నుల ఉల్లిగడ్డను ఎక్స్‌పోర్ట్‌ చేస్తున్నారు. సరిగా పండలేదు కాబట్టే ధరలు పెరిగాయని బుకాయిస్తారు. గోడౌన్లలో బియ్యం ఉన్నాయంటారు. ఫ్రీగా పంచాలని సుప్రీంకోర్టు చెప్పినా పంచరు. మీదినుంచి ఆకలితో మాడొద్దంటారు. అన్నింటినీ ప్రయివేటీకరిస్తుంటారు. మరోవైపు ఉపాధికల్పన ఉద్యోగాలు పెంచుతున్నామంటారు. నిండా అవినీతి ఊబిలో కూరుకుపోయారు. అవినీతిపై పోరాటం చేస్తామంటారు. జెపిసి వేయనంటారు. కోరల్లేని పిఎసి ముందుకొచ్చి సచ్చీలత నిరూపించుకుంటానంటారు.
వీళ్లది నాలుకా? తాటిమట్టా? వినేటోడుంటే అడ్డంగా ఎన్నయినా మాట్లాడేస్తుంటారు. జనాల బుర్రల్లోంచి ఫ్యూజును పీకేసి కన్‌ఫ్యూజ్‌ చేసేస్తారు. జనాన్ని పిచ్చోళ్లు, గొర్రెలమందలు అని అనుకుంటున్నారు. ఇవన్నీ తెలుసుకోకపోతే వారు అనుకునేదే నిజమేనేమో!

Monday, December 20, 2010

బాబు బుర్రలో లైటు వెలిగింది

ఊు... అంటే నేనే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఇన్నాల్లూ కళ్లునెత్తికెక్కించుకుని తిరిగిన చంద్రబాబు ఇప్పుడు దారిన పడ్డాడు. 'వ్యవసాయం దండగ' అని అన్న వ్యక్తి నేడు అన్నదాతల కష్టాలు తీర్చాలంటూ నిరాహారదీక్ష చేస్తున్నాడు. కెసిఆర్‌లాగా ఒక్క రోజులో బిచాణా ఎత్తేసేందుకు ప్రయత్నించలేదు. సంతోషం. చంద్రబాబు మారాడా? మారితే మరీ మంచిది. ఇదే పద్ధతిలో ఎంత సేపు నిలబడతాడో వేచి చూడాల్సిందే...
బాబు ఏ పని చేసినా దాని వెనుక ఓ రెండు మూడు కారణాలుంటాయి. లక్ష్యాలు కూడా అన్నే ఉంటాయి. దీక్షలతో కూడా మనవాడు కుంభాన్ని కొట్టబోతున్నాడు. ఒకటి ఇన్నాళ్లూ పనీపాట లేని తెలుగు తమ్ముళ్లందరినీ 'రైతు' సమస్యలపై జనం దగ్గరికి వెళ్లేట్లు చేయగలిగాడు. జైతెలంగాణా, జై సమైక్యాంధ్ర నినాదాల రందిలో ఎటువైపు పోవాలో తెలియక తికమక పడుతున్న తమ్ముళ్లందరికీ నిజంగా రిలీఫే.. రెండోది కాంగ్రెస్‌ చీలిపోబోతోంది. జగన్‌ కొత్త పార్టీ పెడతానంటున్నాడు. ఆయన తన దగ్గరున్న డబ్బు చూసి విర్రవీగుతున్నాడు. వాళ్ల నాయన పేరును బ్రాండు ఇమేజీగా ప్రచారం చేసి గద్దె నెక్కాలనుకుంటున్నాడు. జగన్‌ చేసే ఏ ప్రయత్నమైనా కాంగ్రెస్‌ను చీల్చేయడం ఖాయం. అదే జరిగితే తక్షణం రాష్ట్ర వ్యాప్తంగా అడ్వాంటేజీ తీసుకుని గద్దెనెక్కాల్సిందీ తెలుగుదేశమే. కాంగ్రేసోళ్లు వాళ్ల పంచాయతీలో పడి జనం సమస్యలను మరిచిపోయారని, కమ్యూనిస్టోళ్లలాగా తాను కూడా సమస్యలపై పోరాడుతున్నానని చెప్పుకునేందుకు ఈ దీక్షలు చంద్రబాబుకు పనికొస్తాయి. మూడోది ప్రత్యేక తెలంగాణా అంశం... ఓ వైపు శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇవ్వబోతోంది. అదేం చెప్పినా రాష్ట్రం రావణకాష్టం కావడం ఖాయం. ఆ తరువాత జనం దగ్గరికి సమస్యలను, పార్టీని తీసుకుపోలేం. ఆ కమిటీ నివేదిక ఇచ్చేలోగానే ఇలాంటి కార్యక్రమం చేస్తే ఈ సమస్యా తీరిపోతుంది.
మొత్తానికి దీక్షలు చేపట్టాలనుకున్న బాబు నిర్ణయం రైట్‌ టైమ్‌లో రైట్‌ డెసిషన్‌ తీసుకున్నట్లుగా ఉంది. అయితే మళ్లీ చెబుతున్నా... చంద్రబాబు తాను తన మాట మీద ఎన్నాళ్లు నిలబడతాడు అన్నదానిపైనే ఫలితాలు ఉంటాయి.. వెయిట్‌ అండ్‌ సీ...

మన మిత్రుడొచ్చాడు

ఇది మూడేళ్ల క్రితం మాట. ఢిల్లీలో అంతర్జాతీయ ట్రేడ్‌ ఫెయిర్‌ జరిగింది. అందులో చైనా ఓ భాగస్వామి దేశం. స్టాల్స్‌ను ఏర్పాటు చేసేందుకు అది అత్యధిక స్థలాన్ని తీసుకున్నది. అనేక స్టాల్స్‌ను పెట్టింది. భారీగా సరుకులను తీసుకొచ్చింది. మూడంటే మూడే రోజుల్లో వాటన్నింటినీ అమ్మేసింది. నాలుగో రోజు స్టాల్స్‌ అన్నీ ఖాళీ చేసి వెళ్లిపోయింది. అదే ఫెయిర్‌లో మనదేశ పారిశ్రామిక వేత్తలు కూడా పాల్గొన్నారు. స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. కానీ పూర్తిస్థాయిలో సంసిద్ధం కాలేదు. చైనాలాగా పక్కా ప్రణాళికతో కూడా లేరు. మూడేళ్ల తరువాత ఇప్పుడు కూడా అలాంటిదే పునరావృతమైంది. 'మేము భాగస్వాములం, పోటీదార్లం మాత్రం కాము' అంటూ మన దేశానికి చైనా వచ్చింది. ఈ దఫా సరుకుల ఓడ రాలేదు. కానీ భారీ ఒప్పందాలను కుదుర్చుకునేందుకు పెద్ద విమానం నిండా 400 మంది వ్యాపార ప్రతినిధులు వచ్చారు. చైనా ప్రధాని వెన్‌ జియాబావో వారికి నేతృత్వం వహించారు. ఒక్క రోజులో 16 బిలియన్‌ డాలర్ల విలువ చేసే 45 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒబామా(10బిలియన్‌ డాలర్లు), సర్కోజి(13బిలియన్‌ డాలర్ల) వాణిజ్య ఒప్పందాల రికార్డులను వీరు బద్దలు కొట్టారు. అయితే ఈ దఫా కూడా మన దేశీయ పెట్టుబడిదారులు పూర్తిస్థాయిలో సంసిద్ధం కాలేదు. వెన్‌ వచ్చినప్పుడు ఆయన్ను కలిసేందుకు టాటా రాలేదు. అంబానీ రాలేదు. సునీల్‌ మిట్టల్‌ రాలేదు. నారాయణమూర్తి కూడా లేడు. అయినా చైనీయులు తమ మొహం మీది చిరునవ్వును చెరగనీయలేదు. లక్ష్యం పట్ల విశ్వాసాన్నీ సడలనివ్వలేదు.

Friday, November 26, 2010

కొత్త సిఎం హిడ్డెన్‌ (రహస్య) ఎజెండా...! (పార్ట్‌ -3)

3. పథకాలన్నీ పేదలకే చేరాలి. లీకేజీలు వుండకూడదు : 2009 ఎన్నికలకు ముందు ఫుల్లుగా రేషన్‌కార్డులిచ్చారు. ఆరోగ్యశ్రీ అన్నారు. తెల్లకార్డు దివ్యౌవషధమన్నారు. సర్వరోగ నివారిణి అన్నారు. అడిగినోడికి, అడగనోడికీ ఇచ్చేశారు. ఎన్నికలైపోయాయి. కాంగ్రెసోళ్లు కళ్లద్దాలు మార్చేశారు. అవన్నీ లబ్దిదారుల వద్ద లేనట్లుగా కనపడిందట. 'బోగస్‌' అంటూ ఎత్తేశారు. ఇప్పుడు కిరణ్‌కుమార్‌ 'లీకేజీ' అంటున్నాడు. రెండింటి సారాంశం ఎత్తివేత. పేదోడు పథకానికి అప్లయి చేసుకున్నాడంటే ఐటి ఉద్యోగం సంపాయించినట్లే లెక్క. అన్ని ఇంటర్వ్యూలుంటాయి. ఆధారాలు చూపెట్టాలి. లబ్దిదారునిగా ముద్రేసుకోవాలంటే అంతకంటే ముందే పది మంది అమ్యామ్యాల లబ్దిదారులను మేపాలి.

కొత్త సిఎం హిడ్డెన్‌ (రహస్య) ఎజెండా...! (పార్ట్‌ -2)

2.సిస్టమ్‌ బాగా లేనప్పుడే సమస్యలొస్తాయి : అదేంటో ఈ ప్రెస్‌మీట్‌ పెట్టిన తరువాత మరునాడే లేక్‌వ్యూగెస్ట్‌ హౌజ్‌లో ఐఎఎస్‌లతో మాట్లాడాడంట. 'మీ చరిత్ర నా దగ్గరుంది. ఇప్పుడైనా మారండి. లేదంటే కష్టాలొస్తాయి.' అని చెప్పాడంట. మరి కాంగ్రెస్సోళ్ల చరిత్ర సంగతేంటి? వాళ్లు చెడి సిస్టమ్‌ను చెడగొట్టారు కదా! బయ్యారం గొయ్యారం దగ్గర్నుంచి ఇందిరమ్మ గుడిసెల దాకా పందికొక్కుల కంటే అన్యాయంగా మెక్కేశారు కదా! అదేమైనా కక్కిస్తారా? అవినీతిపై యాక్షన్‌ గురించి నోటి మాట కూడా మాట్లాడలేదు. అట్లా చేస్తే ఫస్ట్‌ ఊచలు లెక్కించాల్సింది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, వారి బంధువులు, స్నేహితులు, వ్యాపార భాగస్వాములు... ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత జాబితా అవుతుంది. వీరి మీద చర్య తీసుకోరు కానీ అధికారుల మీద చర్యలుండబోతున్నాయన్న మాట. హతవిధీ... మళ్లీ 2000నాటి కాలం వచ్చేసింద్రా దేవుడా...

కొత్త సిఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి హిడ్డెన్‌ (రహస్య) ఎజెండా...! (పార్ట్‌ -1)

 
చేవచచ్చిన రోశయ్య సీట్లోంచి దిగిపోయాడు. కిరణ్‌కుమార్‌ ఆ సీట్లో కూర్చున్నాడు. ఆయన్ను అధిష్టానం సిఎం చేసింది. రెండో రోజు ప్రమాణస్వీకారం చేశాడు. ఆనవాయితీ ప్రకారం ఆయనో ప్రెస్‌మీట్‌ పెట్టాడు. 'మీ ద్వారా రాష్ట్ర ప్రజలతో మాట్లాడుతున్నా..!' అని చెప్పి వరుసబెట్టి ఆయన ప్రాధాన్యతలు చెప్పుకుంటూ పోయాడు. ఆ ప్రాధాన్యతల వెనుక ూన్న సిసలు ప్రాధాన్యతలు వేరే ూన్నాయి.. మీరే చదవండి....

1.నా టాప్‌ ప్రియారిటీ గుడ్‌ గవర్నెన్స్‌ (సుపరిపాలన), లీకేజీలను అరికట్టడం, ట్రాన్స్‌పరెంట్‌ (పారదర్శకత)గా ూండడం : 'గుడ్‌ గవర్నెన్స్‌', 'ట్రాన్సపరెంట్‌' ఈ రెండు పదాలు మన రాష్ట్ర ప్రజలకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ రెండూ ప్రపంచబ్యాంకు మెదడులో పుట్టాయి. చంద్రబాబు నాలు మీదనుంచి, వైఎస్‌ చేతుల మీదుగా, మళ్లీ కిరణ్‌కుమార్‌ నోట వచ్పిపడ్డాయి. ఈ రెండు పదాలు ఫస్ట్‌ ప్రియారిటీ అని చెప్పడం ద్వారా ప్రపంచబ్యాంకు ఏం చెబితే అది చేస్తానని చెప్పకనే చెప్పాడు. సో మన మీద భారాలు పడబోతున్నాయన్నమాట.

Wednesday, November 24, 2010

'దాదా'నా మజాకా

జగదీష్ 
                  హైటు తక్కువ.  వెడల్పు ఎక్కువ. వెనుక నుంచి చూస్తే  రెక్కలు వాల్చి నడుస్తున్న పెంగ్విన్‌లా అనిపిస్తుంది. మొహం మాత్రం గంభీరం. లావాటి మెడ దానిపై అక్కడక్కడ నల్లటి మచ్చలు. ఆయన కళ్లు విశ్రాంతి కావాలంటున్నాయి. కానీ ఆయన శరీరం ఆయన కళ్లమాటను ఎక్కడ వింటుంది? ర్యాలీలో పాల్గొన్నాడు. ఒకరన్నారు ఆరు కిలోమీటర్లు అని. కాదు తొమ్మిది కిలోమీటర్లు అని. కామ్రేడ్‌ మీరు కారెక్కండి అన్నారు కొందరు. రెండు చేతులతో  పొడవాటి జెండాను పట్టుకున్నాడు. ముఖం కనపడే విధంగా తలపైకి కర్రను ఎత్తిపట్టుకుని నడవడం  ప్రారంభించాడు. ఒక కిలోమీటరు...  కామ్రేడ్‌ కారెక్కండి అన్నారు.  ఆయనకు వినిపించలేదు. లేదా వినాలనుకోలేదు. రెండో కిలోమీటరు.. కారును ముందుకు తెచ్చిపెట్టారు.  కళ్లు ఎర్రగా ఉన్నాయి. పేదలరాజ్యాన్ని కూలదోస్తున్న  శక్తులపై కోపం అయి ఉంటుంది. ఎందుకైనా మంచిదని  కారు పక్కకు వెళ్లిపోయింది. అంతే సీరియస్‌గా తొమ్మిది కిలోమీటర్లు కంప్లీట్‌ చేసిన ఆ పెద్దాయన వేదను ఎక్కి మేఘంలా ఘర్జించాడు. జన సంద్రం చప్పట్లు, నినాదాలతో సముద్రుడి ఘోషను వినిపించింది. దీనిని తట్టుకోలేక సింగూరు నుంచి తాటాకు (మమత) వణికిపోతూ చప్పుడు చేసింది. బిమన్‌ దాదానా. మజాకా!

పవిత్ర రాజకీయం దుస్థితి ఇది

జగదీష్
ఒకడేమో (రాహుల్‌గాంధీ) ఈ దేశంలో చేసేందుకు ప్రధాని ఉద్యోగం ఒక్కటే కాదు చాలా ఉన్నాయని అంటాడు. దేశానికి నేతృత్వం వహించే ఆ పదవిని చిన్న చూపు చూస్తాడు. ఇంకోతేమో (మమత) అది సైనేడ్‌ (గూర్ఖాల్యాండ్‌) తింటే చచ్చిపోతారని చెప్పినా వినకుండా నాకు చాక్లెట్‌ (సిఎం సీటు) దక్కేదాకా ఇలాంటివి జనానికి తినిపిస్తానే ఉంటా అని చెబుతోంది. వీరిద్దరూ కలిసి తాతకు (బెంగాల్‌) దగ్గులు (రాజకీయాలు) నేర్పాలనుకుంటున్నారు.

ఆరుగురు వ్యాంపులు

జగదీష్ 
ప్రేమకు వేళాయెరా సినిమాలో గడ్డం చక్రవర్తి మాటిమాటికీ ఒక అక్క ఒక బావ మధ్యలో వ్యాంపు ఇదీ స్టోరీ అని చెబుతుంటాడు. ఇక్కడ కూడా అంతే ఒక అక్క (బెంగాల్‌ ప్రజానీకం) ఒక బావ (లెఫ్ట్‌ఫ్రంట్‌) ఉన్నారు. కానీ వ్యాంపులే (కాళీఘాట్‌  టు పెంటగాన్‌) చాలా మంది ఉన్నారు.