Wednesday, November 24, 2010

ఆరుగురు వ్యాంపులు

జగదీష్ 
ప్రేమకు వేళాయెరా సినిమాలో గడ్డం చక్రవర్తి మాటిమాటికీ ఒక అక్క ఒక బావ మధ్యలో వ్యాంపు ఇదీ స్టోరీ అని చెబుతుంటాడు. ఇక్కడ కూడా అంతే ఒక అక్క (బెంగాల్‌ ప్రజానీకం) ఒక బావ (లెఫ్ట్‌ఫ్రంట్‌) ఉన్నారు. కానీ వ్యాంపులే (కాళీఘాట్‌  టు పెంటగాన్‌) చాలా మంది ఉన్నారు.

                వ్యాంపు నెంబర్‌ 1.మమతబెనర్జీ- ఉండేది కాళీఘాట్‌. మాట్లాడేదీ పూరాజూట్‌. అబద్దాలు మాట్లాడకుండా నిద్దురలేవదు. అబద్దాలు చెప్పకుండా నిద్దురపోదు. కానీ ఆమె మాత్రమే నిజాలు వినాలనుకుంటుంది. పేదల్లో అనుమానాలు తెచ్చామా? లేదా? లెఫ్ట్‌ఫ్రంట్‌ను బలహీనం చేశామా? లేదా? మనకు ఉన్న అడ్డంకులను తొలగించుకున్నామా (హత్యలు చేసైనా సరే) లేదా? ఏ గడ్డి కరిస్తే సీఎం సీటుకు మార్గం దగ్గరవుతుంది? ఇలాంటివి....
                వ్యాంపు నెంబర్‌ 2.మావోయిస్టులు - మావో పేరు తగిలించుకుని గ్యాంగ్‌రేపులు చేస్తున్నారు. రేపిస్టులు అవుతున్నారు. 21రోజుల పాటు ఒక టీచరును రోజుకు కొద్దిమంది చొప్పున అత్యాచారం చేశారు. వీరి వెంట ఉండే 'అక్క'లు 'అన్న'లకు మందు పోసి మరీ రేప్‌ చేయడానికి పంపించారు. సిపిఎం వాడు కనబడ్డాడా చంపేసెయ్‌. సిపిఎం అభిమాని కనబడ్డాడా పది రోజుల పాటు లేవలేకుండా కుమ్మేసేయ్‌. సిపిఎం జెండా వైపు చూశాడా ఉచ్చపోసుకునేవిధంగా చేయ్‌. పేదల పార్టీని ప్రతిబింబించే సిపిఎం అనే మూడక్షరాలు వీరికి కంపరం పుట్టిస్తున్నాయి. పేదలను కుళ్లబొడిచి నవరంద్రాల నుంచీ మూల్గలను పీల్చేసే టిఎంసి అనే మూడక్షరాలు వీరి చెవులకు ఇంపుగా ఉంటున్నాయి.
                 వ్యాంపు నెంబర్‌  3.కాంగ్రెస్‌ - పక్కా వ్యాంపు. అవసరాలకోసం అక్రమ సంబంధాలు కుదుర్చుకుంటోంది. యుపిఎ-1 ఉన్నప్పుడు సక్రమ సంబంధమే ఉండేది. నాలుగేళ్లు బాగానే ఉంది. పక్కింటి పుల్లకూర (అణుపరిహార బిల్లు) పట్ల అట్రాక్ట్‌ అయ్యింది. ఇంటివాడు (వామపక్షం) వద్దే.. అని అన్నాడు. వినలేదు. దానికోసం బయటివాడికి (ఇతర పార్టీల ఎంపీలకు) పైసలిచ్చి మరీ ఇంటివాణ్ని వదులుకుంది (మద్ధతు అక్కర్లేదంది). బెంగాల్‌లో ఇప్పుడు వృద్ధుని (128ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకుంటోన్న కాంగ్రెస్‌) అవతారం ఎత్తింది. 26ఏళ్లు కూడా లేని (మమత బెనర్జీ ఎంపీగా రాజకీయాల్లోకి వచ్చిన సంవత్సరం 1984) టిఎంసితో డ్యూయెట్లు (రాజకీయాలు) పాడుకుంటోంది. కాంగ్రెస్‌కే హాత్‌ గరీబ్‌కే సాత్‌ అంటారు బెంగాల్‌ ప్రజానీకం అన్నమో రామచంద్రా అని అరుస్తుంటే రూపాయి విదల్చరు. ఓ వైపు నక్సలైట్లు దేశ అంతర్గత భద్రతకు ముప్పు అంటారు మరోవైపు వారిని నిలువరించేందుకు సిఆర్‌పిఎఫ్‌ బలగాలను పంపరు. రంకులు నేర్చినామెకు బొంకుడెక్కువ అంటే ఇదేనేమో.
                  వ్యాంపు నెం.4 గూర్ఖాజనముక్తి మోర్చా (జిజెఎం)... బుద్ధుణ్ని (బుద్ధదేవ్‌భట్టాచార్య) మౌనముద్రలో (ప్రజల కోసం రాజకీయాలు నడుపుతుంటే) చూడలేకపోతున్న దీదీ (మమత)తో ఇది జత కట్టింది. మౌనాన్ని చెడగొట్టేందుకు పక్కలో బల్లేలాలను (ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ల) దించుతోంది. ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.
                వ్యాంపు నెం.5 కార్పొరేట్‌ మీడియా.. గాంధీజీ చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు అన్నాడు. ఎయిడ్స్‌ వ్యాధి వచ్చిన తరువాత చెడు చేయొద్దు అనేది కూడా జత చేరింది. ఈ అభినవ గాంధీ (కార్పొరేట్‌ మీడియా) పై నాలుగింటినీ పాటిస్తోంది. చెడు చూడట్లేదు (సిపిఎం ర్యాలీల, ప్రజా ఆందోళనల ఫొటో తీయదు) చెడు వినట్లేదు (ప్రజల కోరికలను, సిపిఎం చేప్పే విషయాలను) చెడు మాట్లాడట్లేదు (సిపిఎం వార్తలను ప్రచురించట్లేదు. సిపిఎం తరఫున ఒక్క వార్త కూడా రాయట్లేదు). చెడు చేయట్లేదు (సిపిఎంను, పేదలను ప్రజావ్యతిరేక  శక్తుల నుంచి కాపాడట్లేదు).. శభాష్‌... టిఎంసి గడ్డి తింటే కేకు తిన్నదని రాస్తుంది. రేపులు టిఎంసి గూండాలు చేస్తే సిపిఎం గూండాలు అని రాస్తుంది. చచ్చింది సిపిఎంవాడైతే టిఎంసి నేత అమర్‌ రహే అంటుంది. పైసలిచ్చి మేపుతున్నందుకు సిపిఎం-పేదల వార్తలను నిర్లజ్జగా ఖూనీ చేస్తోంది. హంతకులను (టిఎంసి-మావోయిస్టు) హీరోలు చేస్తోంది.
                వ్యాంపు నెంబర్‌ 6. పెంటగాన్‌... క్యూబా మీద ఇనుపపాదం పెడతానంది. క్యూబన్లు దానినీ దాని కాలునీ రెండింటినీ కరిగించేశారు. అప్పటి నుంచి కాలికి ఏం వేసుకుని వారిని అణిచేయాలా అని ఆలోచిస్తూనే ఉంది. ఇప్పుడు దాని కన్ను బెంగాలీల మీద పడింది. పేదల్లో సిపిఎం ఉంది కాబట్టి ఎన్జీఓల ముసుగులో పేదల మధ్యకు వెళ్లిపోయి వారి మనసులను ఖరాబు చేసేందుకు, సిపిఎం నుంచి దూరం చేసేందుకు ప్రయత్నిస్తోంది. తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లన్నమాట. ఇద్దరు ప్రేమికులను (సిపిఎం-బెంగాలీ పేదలు) విడగొట్టే దుర్మార్గులను (ఆరుగురు వ్యాంపులను) ఏం చేసినా పాపం కాదు. అయితే ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ ప్రేమికుల మధ్య మంచి అండర్‌స్టాండింగ్‌ ఉంటే దుర్మార్గులు మట్టికొట్టుకుపోతారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఆ అండర్‌స్టాండింగ్‌, అవగాహన కొనసాగాలని కోరుకుందాం.

No comments:

Post a Comment