Thursday, August 25, 2011

దేవేన్‌ శర్మ రాజీనామా వెనుక....


భారత సంతతికి చెందిన దేవేన్‌ శర్మ గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్‌ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారన్న వార్త సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అమెరికా పరపతిని తగ్గిస్తున్న ప్రకటించిన మూడు వారాలకే ఈ నిర్ణయం వెలువడడం వెనుక పెద్ద తతంగమే నడిచింది.
రేటింగ్‌ ఏజెన్సీల స్వతంత్రను కోరిన శర్మ
55ఏళ్ల దేవేన్‌ శర్మ జార్ఖండ్‌ వాసి. ఎస్‌ అండ్‌ పి ఏజెన్సీకి 2007 నుంచి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. రేటింగ్‌ ఏజెన్సీలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడంలో స్వేచ్ఛను కలిగి ఉండాలని ఆయన పదే పదే చెప్పేవారు. 'రేటింగ్‌ నిర్ణయించే పద్ధతులు ఏ ఎజెన్సీకి ఆ ఎజెన్సీ అభివృద్ధి చేసుకోవాలి. అన్ని ఏజెన్సీలూ ఒకే మూసలో నడవాలని చెప్పడం సరైనది కాదు. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే వ్యవస్థీకృత ప్రమాదాలను అంచనా వేయడం సాధ్యం కాదు. దీనిని దృష్టిలో పెట్టుకుని రేటింగ్‌ ఏజెన్సీలు ఎలాంటి భయం లేకుండా తమ నిర్ణయాలను ప్రకటించగలిగే స్వేచ్ఛను ఇవ్వాలి. ఒకసారి నిర్ణయం ప్రకటించిన తరువాత అంతర్జాతీయ మార్కెట్లో తిరోగమన ఫలితాలు వస్తే నియంత్రణ సంస్థలు రేటింగ్‌ ఏజెన్సీ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలంటూ ఒత్తిడి కూడా చేయొద్దు. అలాంటి వాతావరణం రావాలి.' అని ఆయన పలు వేదికల్లో చెబుతూ వచ్చారు. మార్కెట్‌ వర్గాలు సైతం రేటింగ్‌ ఏజెన్సీలు స్వతంత్రంగానే వ్యవహరించడాన్ని కోరకున్నందుకు దేవేన్‌శర్మ నిరాటంకంగా నాలుగేళ్లుగా ఎస్‌అండ్‌పి అధ్యక్షునిగా వ్యవహరించగలిగారు. స్వతంత్రంగా రూపొందించుకున్న పద్ధతుల ద్వారానే ఎస్‌ అండ్‌ పి సైతం రేటింగ్‌ ఇస్తూ వచ్చింది.
మలుపుతిప్పిన 'ఆగస్టు 5' ప్రకటన
ఇలా ఇప్పటి దాకా కొన్ని వేల తనఖా బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రేటింగ్‌ను ఎస్‌ అండ్‌ పి ప్రకటించింది. ఎక్కువశాతం ఎస్‌ అండ్‌ పి చెబుతున్న విషయాలు సరైనవని తేలుతుండడంతో అంతా సాఫీగా నడిచిపోతూ వచ్చింది. ఇలా స్వయంగా అభివృద్ధి చేసుకున్న పద్ధతుల్లోనే ఎస్‌ అండ్‌ పి సంస్థ ఆగస్టు అయిదో తేదీన ఫైనాన్స్‌ పెట్టుబడికి, అంతర్జాతీయ పెట్టుబడిదారీ విధానానికి కీలకమైన అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు గురించి, దాని పరపతి గురించిన నిర్ణయాన్ని వెలువరించింది. 'అమెరికాలో నెలకొన్న రాజకీయ అస్థిరత వల్ల ఆర్థిక పరమైన విధానాలపై సత్వర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వైట్‌హౌజ్‌కు క్రమంగా తగ్గిపోతోంది. దీనివల్ల దేశం రుణ ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థలో సైతం స్తబ్ధత ఏర్పడి తీవ్రమైన సంక్షోభానికి కారణమయ్యే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని అమెరికా పరపతిని ఎఎఎ నుంచి ఎఎప్లస్‌కు తగ్గిస్తున్నామ'ని ఎస్‌అండ్‌పి ఆ రోజున ప్రకటించింది. దీంతో నిన్నటిదాకా ఎస్‌ అండ్‌ పిని పొగుడుతూ వచ్చిన సంస్థలు, ప్రభుత్వాలు, అమెరికా ఒక్కసారిగా విరుచుకుపడడం ప్రారంభించాయి.
ఎదురుదాడికి దిగిన అమెరికా
అమెరికా సెనెట్‌ ఎస్‌ అండ్‌ పి మీద విచారణ జరిపేందుకు ఒక కమిటీని నియమించింది. అమెరికా న్యాయశాఖ ప్రత్యేక కమిషన్‌ను వేసి ఎస్‌ అండ్‌ పి ఇప్పటిదాకా అనుసరిస్తూ వస్తున్న విధానాలన్నింటినీ తిరగదోడేందుకు పూనుకుంది. ఒబామా యంత్రాంగం సైతం నియంత్రణ సంస్థలను రకరకాల ప్రశ్నలను సంధిస్తూ ఎస్‌ అండ్‌ పిపై ఉసిగొల్పింది. ఇంత ఒత్తిడి వచ్చినప్పటికీ ఎస్‌ అండ్‌ పి అధ్యక్షుడు దేవేన్‌ శర్మ నికరంగా నిలబడుతూ వచ్చారు. రాజకీయాంశాలపై తాను చెప్పిన దానిలో ఎలాంటి తప్పు లేదని కూడా తేల్చి చెప్పారు. వాస్తవానికి అమెరికా సైతం ఇతర దేశాలతో వ్యవహరించేటప్పుడు ఎస్‌ అండ్‌ పి సంస్థతో ఆయా దేశాల రాజకీయ పరిస్థితులు, అస్థిరత, సుస్థిరత అంశాలపై రేటింగ్‌ ఇవ్వాలని అనేక మార్లు కోరింది కూడా. ఇప్పుడు అందుకు భిన్నంగా 'సంబంధం లేని రాజకీయ అంశాలను పరపతి నిర్ణయించడంలో ఎలా వినియోగించారం'టూ ఎస్‌ అండ్‌ పిపై ఎదురుదాడికి దిగింది.
తీవ్ర ఒత్తిళ్లు తెచ్చిన ప్రచ్ఛన్న కార్పొరేట్లు
ప్రత్యక్షంగా ఎస్‌ అండ్‌ పిపై ఇలాంటి ఒత్తిళ్లు ఒకవైపు తీసుకువస్తూనే, మరోవైపు నుంచి ప్రచ్ఛన్న కార్పొరేట్లను అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడి, అమెరికా ప్రభుత్వం కలిసి సంయుక్తంగా ఉసిగొల్పాయి. మార్కెట్లు స్తబ్దుగా ఉన్నప్పుడు, లేదా మార్కెట్లు బాగా లాభపడతాయనుకున్నప్పుడు తాము కోరుకున్న కంపెనీని ముక్కలు చెక్కలు చేయాలని రోడ్లెక్కే వారిని కార్పొరేట్‌ యాక్టివిస్టులు (ప్రచ్ఛన్న కార్పొరేట్లు) అని పిలుస్తారు. ఈ తరహా ప్రచ్ఛన్న కార్పొరేట్లు ఎస్‌ అండ్‌ పిలోనూ ఉన్నారు. ఆగస్టు ఒకటిన వీరు ఎస్‌ అండ్‌ పిని ముక్కలు చేయాలని అంతర్గత సమావేశంలో చెప్పారు. ఆగస్టు అయిదున ఎస్‌ అండ్‌ పి అమెరికా పరపతిని తగ్గిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో దిమ్మెరపోయిన ప్రచ్ఛన్న కార్పొరేట్లు ఆగస్టు పదో తేదీ నుంచి రోడ్డెక్కారు. ఎస్‌ అండ్‌ పిని ముక్కలు చేయాలని, దీనిపై వస్తున్న తిరోగమన వాతావరణాన్ని మార్చేసే దూరదృష్టి గల నాయకత్వం రావాలంటూ గగ్గోలు పెట్టారు. మదుపరులందరినీ ఈ దిశగా పోగేశారు. అలా చేయకపోతే పెట్టుబడులు ఉపసంహరించుకుంటామంటూ బెదిరించారు. ఎస్‌ అండ్‌ పి షేర్‌ ధరను క్రమంగా తగ్గిస్తూ పోయారు. ఆగస్టు 22న (సోమవారం) బోర్డు మీటింగ్‌ సమయానికి వీరి ఒత్తిడి పతాకస్థాయికి చేరింది. సంస్థ సిఇఓ, మెక్‌గ్రాహిల్‌ మునిమనవడైన హెరాల్డ్‌ మెక్‌గ్రాహిల్‌ -3 సైతం దీనిపై ఏమీ చేయలేని పరిస్థితి. ఆయనకు సంస్థలో ఉన్న వాటాలకంటే ప్రచ్ఛన్న కార్పొరేట్లయిన జనపార్ట్‌నర్స్‌, ఆన్‌టారియో టీచర్స్‌ పెన్షన్‌ ఫండ్‌ సంస్థలకు ఎక్కువ వాటాలు (5.6శాతం) ఉన్నాయి. బయట వత్తిళ్ళకు తోడు, అంతర్గత ఒత్తిళ్లు సైతం పెరిగిపోవడంతో సంస్థ సిఇఓనే స్వయంగా దేవేన్‌శర్మ అధ్యక్ష పదవికి తక్షణం రాజీనామా చేయబోతారని, సిటీ గ్రూపుకు చెందిన 53ఏళ్ల డగ్లస్‌ పీటర్సన్‌ ఆ స్థానాన్ని సెప్టెంబర్‌ 12వ తేదీ నుంచి అధిరోహిస్తారని, ఎస్‌ అండ్‌ పిని సైతం నాలుగు ముక్కలు చేయబోతున్నామని ప్రకటించాల్సి వచ్చింది. ఇలా ఎస్‌ అండ్‌ పిలో దేవెన్‌శర్మ దశ ముగిసింది.
http://www.prajasakti.com/finance/article-265360

Sunday, August 7, 2011

అమెరికా మునుగుతుందా? తేలుతుందా?

అమెరికా ముక్కు చీదితే... ప్రపంచానికి జలుబు చేస్తుందన్న నానుడి శుక్రవారం నాడు మరోమారు రుజువైంది. అమెరికా ఆర్థిక సూచీల్లో బలహీన చలనం కనిపించడంతో అక్కడి స్టాక్‌ మార్కెట్‌ పతనమైతే సైకిల్‌స్టాండ్‌లా ప్రపంచమార్కెట్లన్నీ పడిపోయాయి. పడిపోయిన మార్కెట్లను లేపే బాధ్యత మళ్లీ అమెరికానే భుజానికెత్తుకోవాలి. అయితే అమెరికా ఇప్పుడా పని చేయగలదా? లేదా? అన్నదే ట్రిలియన్‌ డాలర్ల................